World's Longest Bicycle: పాత రికార్డును ఎలా ‘తొక్కేశారో’ చూడండి!!

Dutch Team Builds Worlds Longest Bicycle At 180 Feet 11 Inches

  • నెదర్లాండ్స్ లో ఏకంగా 180 అడుగుల 11 అంగుళాల సైకిల్ తయారీ
  • ప్రపంచంలోనే అతిపెద్ద సైకిల్ గా సరికొత్త గిన్నిస్ రికార్డు
  • 155 అడుగుల 8 అంగుళాల పేరిట ఉన్న పాత రికార్డు బద్దలు

ఏమిటిది.. ఇంత పొడవుగా, విచిత్రంగా ఉందని ఆశ్చర్యపోతున్నారా? ఇది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సైకిల్! దీని పొడవు ఎంతో తెలుసా? ఏకంగా 180 అడుగుల 11 అంగుళాలు. అంటే రెండు నీలి తిమింగలాలు లేదా నాలుగు డబుల్ డెక్కర్ బస్సులను పక్కపక్కన పెడితే ఎంత పొడవు ఉంటుందో ఈ సైకిల్ కూడా అంత పొడవు ఉందట. అందుకే గిన్నిస్ బుక్ నిర్వాహకులు దీనికి ప్రపంచ రికార్డు కట్టబెట్టేశారు. 155 అడుగుల 8 అంగుళాల పొడవుతో 2020లో నమోదైన గిన్నిస్ రికార్డును ఈ సరికొత్త సైకిల్ బద్దలు కొట్టేసింది. దీన్ని చూసి ఏదో రికార్డు కోసం తయారు చేసిన సైకిల్ మాత్రమే అనుకోకండి. ఈ భారీ సైకిల్ ను తొక్కే ఓపిక ఉన్న వాళ్లు ఎంత దూరమైనా వేసుకెళ్లచ్చట. అయితే దీని భారీ ఆకారం వల్ల నగరాల్లో రోజువారీ పనులకు ఇది పెద్దగా ఉపయోగపడదని గిన్నిస్ నిర్వాహకులు చెబుతున్నారు.

నెదర్లాండ్స్ కు చెందిన 39 ఏళ్ల ఇవాన్ షాల్క్ నేతృత్వంలోని బృందం ఈ సైకిల్ ను తయారు చేసింది. చిన్నప్పుడే ఇవాన్ కు ఇలాంటి భారీ సైకిల్ తయారు చేయాలన్న ఆలోచన ఉండేదట. ఈ విషయాన్ని అతను స్వయంగా వెల్లడించాడు. ఓసారి ఎవరో గిన్నిస్ బుక్ ను బహుమతిగా ఇస్తే అందులో కనిపించిన అతిపెద్ద సైకిల్ రికార్డును చూడగానే ఇవాన్ మనసు పారేసుకున్నాడట. ఎప్పటికైనా గిన్నిస్ రికార్డుకెక్కే సైకిల్ తయారు చేయాలని కలలు కని 2018 నుంచి ప్రణాళికలు రచిస్తున్నాడట. అయితే కోవిడ్ వైరస్ వ్యాప్తి వల్ల రెండేళ్లు దీని తయారీకి బ్రేక్ పడినప్పటికీ ఎట్టకేలకు దాన్ని ఇలా సాకారం చేసుకున్నాడన్నమాట. 

ఈ సైకిల్ తయారీతోపాటు రికార్డు సాధించేందుకు ఇవాన్ బృందం సైకిల్ ను 100 మీటర్ల దూరంపాటు తొక్కిన వీడియోను గిన్నిస్ బుక్ సోషల్ మీడియాతో పంచుకుంది. అందులో సైకిల్ వెనక వైపు నలుగురు వ్యక్తులు పెడల్స్ తో తొక్కుతుంటే ఇవాన్ సైకిల్ ముందు సీట్లో హ్యాండిల్ పట్టుకొని కూర్చోవడం కనిపించింది. 

వాస్తవానికి 1965లోనే గిన్నిస్ బుక్ లోకి అతిపెద్ద సైకిల్ రికార్డు చేరిపోయింది. 26 అడుగుల 3 అంగుళాల పొడవుండే సైకిల్ ను జర్మనీలో తయారు చేశారు. ఆ తర్వాత కాలంలో న్యూజిలాండ్, ఇటలీ, బెల్జియం, ఆస్ట్రేలియాతోపాటు నెదర్లాండ్స్ కు చెందిన రెండు జట్లు కూడా అతిపెద్ద సైకిల్ తయారు చేసి గిన్నిస్ లోకి ఎక్కాయి.







  • Loading...

More Telugu News