Allahabad High Court: మత మార్పిళ్లపై అలహాబాద్ హైకోర్టు ఆందోళన

Majority Population Would Be Minority If

  • దీన్ని కొనసాగనిస్తే దేశంలోని మెజారిటీ జనాభా ఏదో ఒక రోజు మైనారిటీగా మారుతుందని వ్యాఖ్య
  • అలాంటి సమావేశాలను తక్షణమే ఆపాలని ఆదేశం
  • మతమార్పిళ్లు చేయిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి బెయిల్ నిరాకరణ

మత మార్పిళ్లకు కారణమవుతున్న మత సమావేశాలను ఆపాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. అలాంటి మత సమావేశాలను అనుమతిస్తే దేశంలో మెజారిటీగా ఉన్న ప్రజలు ఏదో ఒక రోజు మైనారిటీలుగా మిగులుతారని ఆందోళన వ్యక్తం చేసింది. యూపీలోని హమీర్ పూర్ నుంచి ఢిల్లీలోని ఓ మత సమావేశానికి ప్రజలను తీసుకెళ్లి మతం మార్పిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కైలాష్ అనే నిందితుడి బెయిల్ పిటిషన్ పై వాదనల సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 
 
పోలీసులు నమోదు చేసిన ఎఫ్ ఐఆర్ ప్రకారం మానసిక వ్యాధితో బాధపడుతున్న రాంఫాల్ అనే యువకుడికి ఢిల్లీలో చికిత్స చేయిస్తానంటూ కైలాష్ అనే వ్యక్తి తీసుకెళ్లాడు. వారంలో తిరిగి తీసుకొస్తానని అతని సోదరుడు రాంకాళీ ప్రజాపతికి హామీ ఇచ్చాడు. కానీ ఎన్ని రోజులు గడిచినా రాంఫాల్ ఇంటికి తిరిగి రాకపోవడంతో రాంకాళీ ప్రజాపతి.. ఈ విషయమై కైలాష్ ను నిలదీశాడు. అతన్నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని కిడ్నాప్, యూపీ మత మార్పిళ్ల నిషేధ చట్టం కింద అరెస్టు చేశారు. హమీర్ పూర్ గ్రామం నుంచి కైలాష్ గతంలోనూ చాలా మంది ఢిల్లీలో జరిగే ఓ మత సమావేశానికి తీసుకెళ్లి మత మార్పిడి చేయించినట్లు ఎఫ్ ఐఆర్ లో పేర్కొన్నారు.

తాజాగా ఈ కేసు విచారణ సందర్భంగా యూపీ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పీకే గిరి వాదనలు వినిపించారు. సాధారణంగా మత సమావేశాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలను క్రైస్తవంలోకి మారుస్తున్నారని ఆరోపించారు. హమీర్ పూర్ గ్రామం నుంచి కైలాష్ చాలా మందిని అలా మత మార్పిళ్ల కోసం తీసుకెళ్లాడని.. అందుకు ప్రతిఫలంగా డబ్బు పొందాడని సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలను ప్రస్తావించారు.

అయితే ఈ ఆరోపణలను కైలాష్ తరఫు న్యాయవాది సాకెత్ జైస్వాల్ తోసిపుచ్చారు. రాంఫాల్ ను క్రైస్తవంలోకి ఎవరూ మార్చలేదని చెప్పారు. అతను కేవలం ఓ క్రైస్తవ సమావేశానికి మాత్రమే హాజరయ్యాడని తెలిపారు. సోను అనే పాస్టర్ ఈ తరహా సమావేశాలు నిర్వహిస్తున్నారని.. ఈ కేసులో ఇప్పటికే అతనికి బెయిల్ మంజూరైందని వివరించారు.

వాదనలు ముగియడంతో కైలాష్ కు బెయిల్ ను నిరాకరిస్తూ జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ తీర్పు వెలువరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రజలు స్వేచ్ఛగా ఒక మతాన్ని ఆచరించేందుకు, ఆ మతం గురించి ప్రచారం చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తోందని చెప్పారు. కానీ ఒక మతం నుంచి మరో మతానికి ప్రజలను మార్చడానికి మాత్రం అవకాశం ఇవ్వలేదని గుర్తు చేశారు. మత మార్పిళ్లను ఇలాగే కొనసాగనిస్తే ఏదో ఒక రోజు దేశంలో మెజారిటీగా ఉన్న ప్రజలు మైనారిటీలుగా మిగిలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ఈ తరహా మత సమావేశాలను తక్షణమే ఆపాల్సిన అవసరం ఉందన్నారు.

  • Loading...

More Telugu News