Mallikarjun Kharge: ఆర్ఎస్ఎస్ భావజాలం దేశానికి ప్రమాదకరం.. అన్న ఖర్గే వ్యాఖ్యలతో రాజ్యసభలో దుమారం

Kharge says RSS idealogy a threat for nation

  • రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ
  • దేశంలోని విద్యాసంస్థలు ఆర్ఎస్ఎస్ గుప్పిట్లో ఉన్నాయన్న ఖర్గే
  • ఆర్ఎస్ఎస్, బీజేపీ కలిసికట్టుగా సంస్థలను నాశనం చేస్తున్నాయని ఆగ్రహం
  • ఆర్ఎస్ఎస్ దేశం కోసం పనిచేస్తున్న సంస్థ అంటూ రాజ్యసభ చైర్మన్ ధన్ కడ్ వ్యాఖ్యలు
  • ఖర్గే వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని హెచ్చరిక

లోక్ సభ మాదిరే రాజ్యసభలోనూ విమర్శలు, ప్రతివిమర్శలతో వాతావరణం వేడెక్కింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా... ఆర్ఎస్ఎస్ పై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

యూనివర్సిటీలు, ఎన్ సీఈఆర్ టీ వంటి విద్యాసంస్థల్లో ఆర్ఎస్ఎస్ తన మనుషులను వైస్ చాన్సలర్లుగా, ప్రొఫెసర్లుగా ప్రవేశపెడుతోందని ఆరోపించారు.  దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలన్నింటినీ ఇప్పుడు ఒక సంస్థ (ఆర్ఎస్ఎస్) తన గుప్పిట్లోకి తీసుకుందని విమర్శించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ కలిసికట్టుగా దేశంలోని కీలక సంస్థలన్నింటినీ నాశనం చేస్తున్నాయని ఖర్గే మండిపడ్డారు. 

ఖర్గే వ్యాఖ్యల పట్ల ఎన్డీయే సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ కడ్ కూడా ఖర్గే వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ దేశం కోసం పనిచేస్తున్న సంస్థ అని, ఆ సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు ఉందని ధన్ కడ్ స్పష్టం చేశారు. అటువంటి సంస్థలో సభ్యత్వం కలిగి ఉండడం నేరమా? అని ఖర్గేని ప్రశ్నించారు. ఖర్గే వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని ధన్ కడ్ హెచ్చరించారు. 

అయితే, ఖర్గే వెనుకంజ వేయకుండా ఆ తర్వాత కూడా తన విమర్శల దాడిని కొనసాగించారు. ఆర్ఎస్ఎస్ భావజాలం దేశానికి ప్రమాదకరం అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News