Pawan Kalyan: మంత్రిగా జీతం తీసుకోవడానికి మనస్కరించలేదు.. ఎందుకంటే..!: పవన్ కల్యాణ్

AP Dy CM Pawan Kalyan Speech at pension distribution in kakinada

  • కాకినాడ జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం
  • పంచాయతీరాజ్ శాఖలో ఖజానా ఖాళీగా ఉందన్న మంత్రి
  • అందుకే ఈ నాలుగైదు రోజుల జీతం వదులుకున్నట్లు వెల్లడి
  • గెలిపించిన ప్రజలకు పింఛన్లు ఇచ్చి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్న పవన్

ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఊరేగింపులు జరుపుకోవడం తనకు ఇష్టం ఉండదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు పింఛన్లు ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికే నేడు నియోజకవర్గానికి వచ్చినట్లు తెలిపారు. ఈమేరకు పిఠాపురం నియోజకవర్గం కాకినాడ జిల్లా గొల్లప్రోలులో సోమవారం జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. పలువురు లబ్దిదారులకు పింఛన్లు అందజేశాక సభను ఉద్దేశించి ప్రసంగించారు. పిఠాపురం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు.

ప్రభుత్వంలో తాను కీలక శాఖలు తీసుకున్నానని, వాటి అధ్యయనానికి, అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతోందని డిప్యూటీ సీఎం చెప్పారు. మాటలు తక్కువ చెప్పి ఎక్కువ పని చేయాలన్నది తన అభిమతమని వివరించారు. పంచాయతీరాజ్ మంత్రిగా జీతం తీసుకుని పనిచేయాలని అనుకున్నా.. కానీ శాఖలో నిధులు లేవని పవన్ కల్యాణ్ చెప్పారు. అందుకే గత నెలకు సంబంధించిన నాలుగైదు రోజుల జీతానికి సంబంధించిన ఫైల్ పై సంతకం పెట్టడానికి మనస్కరించలేదని వివరించారు. తనకు జీతం ఏమీ వద్దని అధికారులకు చెప్పానన్నారు. గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులు ఎటు వెళ్లాయో తెలియదని చెప్పారు. ఈ శాఖలో నిధులు లేకున్నా అప్పటి సీఎం మాత్రం రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్నాడని విమర్శించారు. ఇదంతా చూశాక ప్రజలకు తాను మాట ఇస్తున్నానని.. పంచాయతీ రాజ్ శాఖలో తనవైపు నుంచి ఎలాంటి అవినీతికి తావుండదని స్పష్టం చేశారు. 

గోదావరి జిల్లాల్లో తాగునీటికి కొరత..
పక్కనే గోదావరి పారుతున్నప్పటికీ గోదావరి జిల్లాల్లో చాలాచోట్ల తాగడానికి మంచినీళ్లు దొరకడంలేదని పవన్ కల్యాణ్ చెప్పారు. జల్‌జీవన్‌ మిషన్‌ నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వం వాటిని ఉపయోగించలేదన్నారు. అడగడమే ఆలస్యంగా కేంద్రం నిధులు ఇచ్చేందుకు రెడీగా ఉన్నప్పటికీ మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. రాబోయే ఐదేళ్లలో అద్భుతాలు చేసి చూపిస్తామని చెప్పను కానీ ప్రభుత్వం జవాబుదారీతనంతో నడుచుకుంటుందని గట్టిగా చెప్పగలనన్నారు. నా దేశం కోసం, నా నేల కోసం పనిచేస్తానని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే తానున్నట్లు స్పష్టం చేశారు. యాత్రలు చేసి, విజయాన్ని గొప్పగా చాటుకోవాలని తనకు లేదన్నారు. మంత్రిగా సంబంధిత శాఖలను తీర్చిదిద్ది, పిఠాపురం నియోజకవర్గంను దేశానికి రోల్ మోడల్ గా అభివృద్ధి చేయాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు. పనిచేసి మన్ననలు పొందాలని తాను భావిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు.

డబ్బులు వెనకేసుకోవాలనే కోరిక లేదు..
‘నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా యువతలో ప్రతిభను వెలికితీయాలి. విదేశాలకు వెళ్లే వారికి శిక్షణ ఇప్పించి పంపాలి. కాలుష్యంలేని పరిశ్రమలను తీసుకురావాలి. డబ్బులు వెనకేసుకోవాలనే కోరిక లేదు.. నాకు కావాల్సింది ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం మాత్రమే. అన్ని పనులూ చిటికెలో కావు.. కానీ అయ్యేలా పని చేస్తాం. పార్టీకి ఓటేసినా, వేయకపోయినా అర్హత ఉన్న వారందరికీ పింఛన్లు వస్తాయి’’ అని పవన్‌ కల్యాణ్ చెప్పారు.

  • Loading...

More Telugu News