North Korea: అరాచకం... దక్షిణ కొరియా పాటలు విన్నాడని... ఉత్తర కొరియా యువకుడికి బహిరంగ ఉరి

North Korea publicly executes 22 year old man for listening to Kpop

  • రెండేళ్ల క్రితం నాటి ఘటన వెెలుగులోకి
  • ఏ వినోదమూ లేకుండా జీవితం నిస్సారంగా సాగుతుండడంపై నార్త్ కొరియా యువతలో ఆవేదన
  • ‘రియాక్షనరీ ఐడియాలజీ అండ్ కల్చర్’ను నిషేధిస్తూ తీసుకువచ్చిన చట్టాన్ని ఉల్లంఘించాడని యువకుడికి మరణశిక్ష 

దక్షిణ కొరియా మ్యూజిక్ విన్నాడని, దక్షిణ కొరియా సినిమాలు చూశాడని ఆరోపిస్తూ ఉత్తర కొరియాలో 22 ఏళ్ల యువకుడికి బహిరంగంగా మరణశిక్ష అమలు చేశారు. 2022లో ఈ ఘటన జరగ్గా ఉత్తర కొరియా మానవహక్కుల సంఘం తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. సౌత్ హ్వాంఘ్వే ప్రావిన్స్‌కు చెందిన యువకుడు 70 కే-పాప్ (కొరియా పాప్యులర్) పాటలు వినడంతోపాటు 3 సినిమాలు చూసినట్టు నిర్ధారణ కావడంతో అతడిని బహిరంగంగా ఉరితీశారు. 

‘రియాక్షనరీ ఐడియాలజీ అండ్ కల్చర్’ ను నిషేధిస్తూ తీసుకువచ్చిన చట్టాన్ని ఆ యువకుడు ఉల్లంఘించినట్టు అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ అభియోగాలు నిజమని తేలడంతో బహిరంగంగా మరణశిక్ష అమలుచేశారు. 

సౌత్ కొరియాను ఆగర్భ శత్రువుగా భావించే కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ హయాంలోనే ఇలాంటి చట్టాలు రూపొందగా, కిమ్ హయాంలో ఇవి మరింత పదునెక్కాయి. కె-పాప్, కె-డ్రామా అనేవి దక్షిణ కొరియా సంగీతం, వెబ్ సిరీస్ లకు రూపాలు. ఇటీవల వీటిపై నార్త్ కొరియా యువత మనసు పారేసుకుంటోంది. జీవితంలో ఇలాంటి ఏ వినోదమూ లేకుండా నిస్సారంగా బతకడం కంటే చావు మేలంటూ ఉత్తర కొరియా యువత బహిరంగంగానే చెబుతూ చట్టాలను ధిక్కరిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి అధికారులు తరచూ ప్రజల మొబైల్ ఫోన్లను తనిఖీ చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నారు.

నార్త్ కొరియాలో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయంటే.. పెట్టుబడిదారీ ఫ్యాషన్ పోకడలపై అక్కడ నిషేధం ఉంది. అంటే, కేశాలంకరణ, స్కిన్నీ జీన్స్, విదేశీ భాషలు ఉన్న టీషర్టులు ధరించడం, జుట్టుకు సంప్రదాయేతర రంగులు పూసుకోవడం, వధువు తెల్లని దుస్తులు ధరించడం, వరుడు వధువును మోసుకెళ్లడం, సన్ గ్లాసెస్ ధరించడం, మద్యం తాగేందుకు వైన్ గ్లాస్‌లను ఉపయోగించడం వంటివి అక్కడ తీవ్రమైన నేరాలు.

  • Loading...

More Telugu News