Madhya Pradesh: అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు.. తొలి కేసు నమోదు

Madhya Pradesh registers first case under new criminal laws

  • నేటి నుంచి దేశవ్యాప్తంగా ఆచరణలోకి వచ్చిన మూడు క్రిమినల్ చట్టాలు
  • మధ్యప్రదేశ్‌లో రాత్రి 12.20 గంటలకు తొలి కేసు నమోదు
  • ఐపీసీ స్థానంలో వచ్చిన భారతీయ న్యాయ వ్యవస్థ చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు

బ్రిటీష్ వలస పాలకుల నాటి చట్టాల స్థానంలో కొత్త క్రిమినల్ చట్టాలు ఈ రోజు (జులై 1) నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానాల్లో వరుసగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు ఆచరణలోకి వచ్చాయి. దేశంలో ఆధునికమైన, మరింత సమర్థమంతమైన న్యాయ వ్యవస్థను నెలకొల్పడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ చట్టాల కింద మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మొట్టమొదటి కేసు నమోదైంది.

ధ్వంసానికి సంబంధించిన ఘటనపై భోపాల్‌లోని నిషాత్‌పురా పోలీస్ స్టేషన్‌లో తొలికేసు నమోదైంది. అర్ధరాత్రి 12:05 గంటలకు దాడి జరగగా.. ఫిర్యాదు మేరకు రాత్రి 12:20 గంటలకు కొత్త చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కొత్త చట్టాల కింద కేసు నమోదు చేశామని స్టేషన్ ఇన్‌ఛార్జ్ వెల్లడించారు. భైరవ్ సాహు అనే వ్యక్తి తనపై కొందరు వ్యక్తులు దాడి చేశారని ఫిర్యాదు చేశారని, నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని వివరించారు. 

భారతీయ న్యాయ వ్యవస్థ చట్టం ప్రకారం.. సెక్షన్ 115 కింద దాడి, సెక్షన్ 296 కింద అసభ్యకర ప్రవర్తన, సెక్షన్ 119 కింద అల్లరి చేయడం కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఇక మరుగున పడిన ఐపీసీ ప్రకారం ఈ దాడి ఘటనకు సంబంధించి సెక్షన్ 323 కింద దాడి, సెక్షన్ 294 కింద అసభ్యకరమైన ప్రవర్తన, సెక్షన్ 327 కింద అల్లరి చేయడం కేసులు పెట్టేవారు. 

కాగా మూడు కొత్త క్రిమినల్ చట్టాలు భారత పార్లమెంటులో డిసెంబర్ 21, 2023న ఆమోదం పొందగా డిసెంబర్ 25, 2023న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. అదే రోజు అధికారిక గెజిట్‌ కూడా విడుదలైంది.

  • Loading...

More Telugu News