Rachamallu Sivaprasad Reddy: మేం ఓడిపోయాం... మీరు మోసపోయారు: వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు

YCP Ex MLA  Rachamallu interesting comments

  • ప్రజలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాచమల్లు
  • ఇక నుంచి ప్రజలు ప్రతి రోజూ మోసపోతుంటారని వెల్లడి
  • తాము ప్రజల కోసం పోరాటాలు చేస్తూనే ఉంటామని స్పష్టీకరణ
  • డీఎస్సీ రూపంలో చంద్రబాబు తొలి మోసం చేశాడని వ్యాఖ్యలు

ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ... ఎన్నికల్లో మేం ఓడిపోయాం, మీరు మోసపోయారు అని పేర్కొన్నారు. ఓడిపోయిన వారి కంటే మోసపోయిన వారే ఎక్కువ దురదృష్టవంతులు... దుఃఖిస్తారు... మీ పరిస్థితి అదే అని వ్యాఖ్యానించారు. 

"నేటి నుంచి ఐదు సంవత్సరాల పొడవునా ప్రతి రోజూ మీరు మోసపోతూనే ఉంటారు... దుఃఖిస్తూనే ఉంటారు... ఆశించిన లబ్ధి మీకు అందక ఇబ్బందులు పడుతూనే ఉంటారు... మీ తరఫున మేం ప్రశ్నిస్తూనే ఉంటాం... మీ తరఫున మేం రాష్ట్ర ప్రభుత్వం మీద శాంతియుత పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటాం... మీరు మాకు ఓటు వేయలేకపోయినా ఫర్వాలేదు, మమ్మల్ని మీరు ఓడించినా ఫర్వాలేదు, మీ తరఫున మేం పోరాటం చేసే క్రమంలో కనీసం నైతికంగా బలాన్ని అందించే ప్రయత్నం చేయండి... ఈ ఐదేళ్లలో మేం చేయబోయే పోరాటాలలో మీ మద్దతును మాకివ్వండి" అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

"చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మోసం మొదలైంది. తొలి సంతకం డీఎస్సీపైనే అన్నారు. అంతకుముందు జగన్ మోహన్ రెడ్డి గారు 6 వేల ఉద్యోగాలతో డీఎస్సీకి అనుమతులు ఇస్తే, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 10 వేల టీచర్ ఉద్యోగాలకు సంతకం చేశారు. మొత్తం కలిపితే 16 వేల ఉద్యోగాలు. 

రాష్ట్రంలో 50 వేల ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకం జరపాల్సి ఉంది. 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయకుండా, 10 వేల ఉద్యోగాలకే సంతకం పెడతారా? తనను నమ్మి ఓటేసిన నిరుద్యోగ యువతను చంద్రబాబు ఈ విధంగా మోసం చేసినట్టే. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతలో 80 శాతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటేశారు. తద్వారా నా ఓటమికి కారణమయ్యారు. 

ఇక, మరో మోసం కూడా చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారు. వారికి రూ.10 వేల వేతనం ఇస్తామని చెప్పారు. కానీ పెన్షన్ల పంపిణీని ఇతర ఉద్యోగులతో చేపడుతూ, మీరు వాలంటీర్ వ్యవస్థకు మంగళం పాడినట్టేనా? అని ప్రజలు అనుకుంటున్నారు"అని రాచమల్లు వివరించారు.

  • Loading...

More Telugu News