Joe Biden: నీకు వయసు పైబడింది... అమెరికా అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకో: బైడెన్ కు బాల్య స్నేహితుడి సూచన

Childhood friend says Biden is old

  • నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు
  • రేసులో బైడెన్, ట్రంప్
  • గురువారం నాటి డిబేట్ లో పేలవ ప్రసంగం చేసిన బైడెన్
  • బైడెన్ పరిస్థితి చూశాక ఏడ్చేశానన్న జే పారిని
  • నీ పరిస్థితి ఏమీ బాగాలేదు అంటూ బైడెన్ ను ఉద్దేశించి బహిరంగ లేఖ

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబరులో జరగనుండగా, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి పోటీ చేస్తున్నారు. అయితే, బైడెన్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఆయన ఇక పోటీ చేయకపోవడమే మంచిదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గురువారం నాటి ఓపెన్ డిబేట్ లో బైడెన్ పేలవ ప్రసంగం చూశాక ఈ అభిప్రాయాలకు మరింత బలం చేకూరింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో నిలవడంపై బైడెన్ పునరాలోచించుకోవాలని సన్నిహితులు అంటున్నారు. 

తాజాగా బైడెన్ బాల్య స్నేహితుడు, ప్రముఖ రచయిత జే పారిని కూడా ఇదే రీతిలో స్పందించారు. పారిని రాసిన బహిరంగ లేఖ సీఎన్ఎన్ ఓపీనియన్ పేజిలో ప్రచురితమైంది. 

"అమెరికాలో చాలా కొద్దిమంది నాయకులు విశాల హృదయాన్ని, మితవాద భావాలను కలిగి ఉన్నారు. వారిలో నువ్వు కూడా ఉంటావు. కానీ ఇప్పుడు నువ్వు కూడా నాలాగా చాలా ముసలాడివి అయిపోయావు. రోజంతా పనిచేసేందుకు బలవంతంగా శక్తిని కూడదీసుకోవాల్సి రావడం ఎలా ఉంటుందో నాకు తెలుసు. మనకు వయసు పైబడిపోయింది. ఒకప్పుడు సహకరించినట్టుగా శరీరాలు ఇప్పుడు సహకరించవు. ఒక్కోసారి ఉదయం లేవడానికి కూడా ఇబ్బంది పడిపోతాం. 

అట్లాంటాలో నువ్వు గురువారం నాడు హాజరైన డిబేట్ చూశాక ఏడుపొచ్చినంత పనైంది. వేదికపైకి రావడానికే నువ్వు ఇబ్బందిపడడం కనిపించింది. వేదికపై నువ్వు తడబడడం, అయోమయంగా చూడడం నాకు స్పష్టంగా అర్థమైంది. నువ్వు ఎప్పటివాడివో... నీలో గట్టిదనం లేదు, పెళుసుబారిపోయావు. నీ పరిస్థితి చూశాక నాకు తెలియకుండానే నేను ఏడ్చేశాను. నీ కోసం, దేశం కోసం కన్నీరుపెట్టాను" అని జే పారిని తన బహిరంగ లేఖలో వివరించారు.

More Telugu News