Israel: పొరపాటున పాలస్తీనా సిటీలోకి ఎంటరైన ఇజ్రాయెల్ డ్రైవర్.. కారును తగలబెట్టిన పౌరులు.. వీడియో ఇదిగో!
- పాలస్తీనా సిటీ ఖలందియాలో ఘటన
- పౌరుల దాడిలో గాయాలపాలైన డ్రైవర్
- కాపాడి ఆసుపత్రిలో చేర్పించిన సైనికులు
ఇజ్రాయెల్ పౌరుడు ఒకరు పొరపాటున తన కారుతో పాలస్తీనా భూభాగంలోకి ప్రవేశించాడు.. ఇది గమనించిన స్థానికులు ఆ కారుపై రాళ్ల దాడి చేశారు. ఆపై డ్రైవర్ ను చితకబాది కారును తగలబెట్టారు. పాలస్తీనా టౌన్ ఖలందియాలో చోటుచేసుకుందీ ఘటన. వెస్ట్ బ్యాంక్ లోని జెరూసలెం, రామల్లాహ్ మధ్య ఖలందియా టౌన్ ఉంది. ఇటీవల ఇజ్రాయెల్ పౌరుడు ఒకరు తన కారుతో పొరపాటున ఈ టౌన్ లోకి ఎంటరయ్యాడు.
గాజాపై దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్ పై కోపంతో మండిపడుతున్న పాలస్తీనా పౌరులు.. తమ కోపాన్నంతా ఈ కారు డ్రైవర్ పై చూపించారు. కారుపైకి రాళ్లు విసురుతూ వెంటపడ్డారు. ఇది చూసి భయాందోళనతో పారిపోయేందుకు ఇజ్రాయెల్ పౌరుడు ప్రయత్నించాడు. అయితే, రోడ్డుపై వెళుతున్న మరో కారు దారివ్వకుండా అడ్డుకోవడం వీడియోలో కనిపించింది. మిలటరీ చెక్ పోస్ట్ దగ్గర్లో ఓ డివైడర్ ను ఢీ కొట్టి కారు ఆగింది.
దీంతో అక్కడికి చేరుకున్న పాలస్తీనా పౌరులు.. డ్రైవర్ ను బయటకు లాగి చితకబాదారు. కారుకు నిప్పంటించారు. మంటల్లో తగలబడుతున్న కారు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పాలస్తీనా పౌరుల దాడిలో గాయపడ్డ ఇజ్రాయెల్ యువకుడిని సైనికులు కాపాడి జెరూసలెంలోని ఆసుపత్రికి తరలించారు.