Badradri power plant: భద్రాద్రి పవర్ ప్లాంట్ పై పిడుగు.. భారీగా ఎగిసిపడ్డ మంటలు

Thunderstrom in Badradri Power Plant caused fire accident

  • రూ.30 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందంటున్న అధికారులు
  • 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం
  • పునరుద్ధరణకు సమయం పడుతుందంటున్న ఇంజనీర్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్) లో శనివారం రాత్రి పిడుగుపడింది. ప్లాంట్ లోని జీటీ ట్రాన్స్ ఫార్మర్ పై పిడుగుపడడంతో మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే స్పందించిన అధికారులు పవర్ ప్లాంట్ ను ఆపేసి మంటలు విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది సుమారు అరగంట పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. కాగా, ఈ పిడుగుపాటుతో 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది.

ట్రాన్స్ ఫార్మర్ పూర్తిగా ధ్వంసం కావడంతో సుమారు రూ.30 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. మెయిన్ ట్రాన్స్ ఫార్మర్లు ఉండే ప్రాంతంలోనే మంటలు చెలరేగడంతో అధికారులు యూనిట్ 1, 2 లలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. యూనిట్ 1 పునరుద్ధరణకు మరింత సమయం పడుతుందని వెల్లడించారు. ఈ దుర్ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. బీటీపీఎస్సీఈ అధికారికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.

  • Loading...

More Telugu News