BJP: రాజ్‌కోట్ విమానాశ్రయంలో చిరిగిన టెంట్... నెహ్రూని నిందించవద్దంటూ బీజేపీ సెటైర్
- రాజ్‌కోట్ విమానాశ్రయంలో పైకప్పుగా ఏర్పాటు చేసిన టెంట్ చినిగి కూలిన వైనం
- ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
- అక్కడ క్లాత్ టెంట్ మాత్రమే చిరిగిందని... కట్టడం కూలినట్లు కాదన్న బీజేపీ నేత
- నెహ్రూ ప్రజలకు అవసరమైన స్థాయిలో విమానాశ్రయాలు నిర్మించలేదని ఎద్దేవా
గుజరాత్‌లోని రాజ్‌కోట్ విమానాశ్రయంలో పైకప్పుగా ఏర్పాటు చేసిన టెంట్ కొంతభాగం చిరిగి కిందపడిపోయింది. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. అయితే, ఇందుకు 'నెహ్రూను నిందించవద్దంటూ' బీజేపీ చురక అంటించింది. గుజరాత్‌లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాజ్‌కోట్ విమానాశ్రయంలో నీరు నిలవకుండా ఉండేందుకు మరమ్మతులు చేపడుతున్నారు. ఈ క్రమంలో టెర్మినల్ వెలుపల ప్రయాణికుల రాకపోకల కోసం టెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ టెంట్ కొంతభాగం చిరిగి... వర్షానికి కిందపడిపోయింది.
ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. అయితే, ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. ఎయిర్ పోర్టును ప్రధాని మోదీ గత ఏడాదే ప్రారంభించారని, అప్పుడే కూలిపోయిందని విమర్శలు గుప్పించారు.
అయితే, బీజేపీ దీటుగా స్పందించింది. ఆ పార్టీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా రాజ్ కోట్ విమానాశ్రయంలోని క్లాత్ టెంట్ చిరిగిపోయిందని... అంతేకానీ, కట్టడం కూలినట్లు కాదన్నారు. అయితే, ఈ ఘటనకు మాజీ ప్రధాని నెహ్రూను నిందించవద్దని సెటైర్ వేశారు. ఎందుకంటే ఆయన ప్రజలకు అవసరమైన స్థాయిలో విమానాశ్రయాలను నిర్మించలేదన్నారు. ఆయన హయాంలో మనమంతా డీఆర్డీవో ధ్రువీకరించిన ఎడ్లబండ్లలో ప్రయాణించామని చురక అంటించారు.