T20 World Cup 2024: టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ ఫీవర్.. టీమిండియా గెలవాలని అభిమానుల ప్రత్యేక పూజలు!
![Cricket fans offer prayers for the victory of team India in T20 World Cup 2024 final](https://imgd.ap7am.com/thumbnail/cr-20240629tn667fe234e833b.jpg)
- కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ పోరు
- దేశవ్యాప్తంగా పీక్‌కు చేరిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఫీవర్
- ప్రయాగ్ రాజ్, కాన్పుర్, వారణాసిలో భారత జట్టు గెలుపును కాంక్షిస్తూ పూజలు
టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ పోరులో బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్లు మరికొన్ని గంటల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఫీవర్ మొదలైపోయింది. 11 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ భారత జట్టు ఐసీసీ టైటిల్ గెలవాలని యావత్ క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. దీంతో పలు రకాలుగా టీమిండియాకు మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ సేన విజయం సాధించాలని క్రికెట్ ఫ్యాన్స్ పూజలు చేస్తున్నారు.
యూపీలోని ప్రయాగ్ రాజ్, కాన్పుర్‌లలో భారత జట్టు గెలుపును కాంక్షిస్తూ పూజలు నిర్వహించారు. ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం ప్రాంతంలో క్రికెట్ అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత్ గెలవాలని హారతి ఇచ్చారు. భారత సారధి రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫొటోలు, జాతీయ జెండాలు పట్టుకొని 'జై హింద్' అంటూ నినాదాలు చేశారు. ఆటగాళ్ల ఫొటోలు ప్రదర్శిస్తూ మేళతాళాలతో భజన కూడా చేశారు. అటు వారణాసిలో కూడా భారత్ గెలవాలని క్రికెట్ లవర్స్ టీమిండియా ప్లేయర్ల ఫొటోలతో హోమం నిర్వహించారు.