Virat Kohli: వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు విరాట్ కోహ్లీకి రవిశాస్త్రి సలహా!

Ravi Shastri said that Virat Kohli should stick to his natural game without trying to be overly aggressive
  • కోహ్లీ తన సహజ సిద్ధమైన ఆట ఆడాలని సూచన
  • రోహిత్‌ను చూసి అతి దూకుడుగా ఆడొద్దని సలహా  
  • టీ20 వరల్డ్ కప్‌లో పేలవమైన ఫామ్‌లో ఉన్న విరాట్
  • ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడి కేవలం 75 పరుగులు మాత్రమే చేసిన వైనం

టీ20 వరల్డ్ కప్ 2024‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యారు. ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడి కేవలం 75 పరుగులు మాత్రమే సాధించాడు. దీంతో ఇవాళ (శనివారం) జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో ఎలా ఆడనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. కాగా టీ20 ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లి పేలవ ప్రదర్శనపై పలువురు క్రికెటర్లు, క్రికెట్ నిపుణులు, అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మాత్రం కోహ్లీకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు.

సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో కోహ్లీ విఫలమైన తర్వాత రవిశాస్త్రి కీలక సలహా ఇచ్చారు. అతి దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించవద్దని, కోహ్లీ తన సహజమైన ఆటకు కట్టుబడి ఉండాలని రవిశాస్త్రి సూచించారు. దూకుడుగా ఆడటం కోహ్లీ ఆట కాదని, ఆరంభంలోనే వేగంగా ఆడేందుకు తొందర పడుతున్నాడని పేర్కొన్నారు. ముఖ్యంగా మరో ఎండ్‌లో దూకుడుగా ఆడుతున్న రోహిత్ శర్మను చూసి కోహ్లీ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నారు.

విరాట్ కోహ్లీ సంప్రదాయక క్రికెటర్ అని, అయితే క్రీజులో ఎక్కువ సమయం గడిపితే అతడు సులభంగా పరుగులు రాబట్టగలడని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌లో రీస్ టాప్లీ వేసిన మూడో ఓవర్‌లో కోహ్లీ ఒక భారీ సిక్సర్‌ బాదాడు. రెండు బంతుల తర్వాత మిడ్-వికెట్ వైపు మరో పెద్ద షాట్‌కు ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీనిపై రవిశాస్త్రి స్పందిస్తూ.. తన ఆటతీరుకు భిన్నంగా వ్యవహరించినప్పుడు కోహ్లీ ఈ విధంగా పెవిలియన్ చేరాల్సి వస్తుందని రవిశాస్త్రి వ్యాఖ్యానించారు.

‘‘కోహ్లీ అవకాశం లేని షాట్ల కోసం ప్రయత్నించాడు. ఆటగాడు టాప్ ఫామ్‌లో ఉన్నప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయాలి. పరుగులు లేక ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ తరహా షాట్లు ఆడడం అంత సులభం కాదు’’ అని స్టార్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. కాగా కోహ్లీ ఫైనల్ మ్యాచ్‌లోనైనా రాణించి టీమిండియాను వరల్డ్ కప్ గెలిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

  • Loading...

More Telugu News