Brain Power: బ్రెయిన్ పవర్ పెరగాలంటే ఇలా చేసి చూడండి! వేగంగా రిజల్ట్స్!
- మెదడుకు ఎంతగా పనిచెబితే అంతగా రాటుదేలుతుందంటున్న నిపుణులు
- పజిల్స్, కసరత్తులతో మెదడు ఆరోగ్యం రెట్టింపు
- మంచి సామాజిక బంధాలూ మెదడు ఆరోగ్యానికి కీలకం
- నిరంతరం కొత్త విషయాలతో చురుగ్గా మెదడు
ఉరుకులపరుగుల ఆధునిక జీవితంలో మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో కీలకం. నిపుణుల ప్రకారం, మనిషి మెదడు కూడా సాధారణ కండరాల లాంటిది. దానికి ఎంతగా పనిచెబితే అంతగా రాటుదేలుతుంది. శక్తిమంతమవుతుంది. మరి మెదడు సామర్థ్యాన్ని పెంచేందుకు ఏమేం చేయాలో ఓసారి చూద్దాం.
- పజిల్స్, క్రాస్‌వర్డ్స్, కొత్త భాషలను నేర్చుకోవడం ద్వారా మెదడును నిత్యం చురుకుగా ఉంచాలి. ఈ అలవాటుతో బ్రెయిన్ పవర్ ఇనుమడిస్తుంది.
- సాధారణ ఎక్సర్‌సైజులు కండరాలకే కాకుండా మెదడునూ ఉత్తేజితం చేస్తాయి. కసరత్తులతో మెదడులో కొన్ని రకాల రసాయనాలు విడుదలై నాడీ కణాల మధ్య అనుసంధానత ఇనుమడింపజేస్తాయి. ఫలితంగా మెదడు సామర్థ్యం పెరుగుతుంది.
- మెదడు ఆరోగ్యాన్ని పెంచే ఆహారం తీసుకోవడాన్ని మర్చిపోకూడదు. పండ్లు, ఆకుకూరలు, ఒమెగా-3 ఫాటీ యాసిడ్ వంటివి ఆహారంలో సమృద్ధిగా ఉండేలా చూసుకోవడం మెదడు ఆరోగ్యానికి కీలకం
- మెదడు ఆరోగ్యానికి తగినంత నిద్ర కూడా అవసరమే. నిద్రలో మెదడు పనితీరు స్థిరీకరణ చెందుతుంది. కొత్తగా నేర్చుకున్న విషయాలు చిరకాలం గుర్తుండేలా పదిలపరుచుకుంటుంది.
- మెదడుకు చేటు చేసే అంశాల్లో ఒత్తిడి అతిముఖ్యమైనది. ఒత్తిడి కారణంగా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, విషయాలను అర్థం చేసుకునే సామర్థ్యం వంటివన్నీ కుంటుపడతాయి. కాబట్టి, ధ్యానం, బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు వంటి వాటితో ఒత్తిడి తాలూకు ప్రతికూల ప్రభావం నుంచి బయటపడొచ్చు.
- మెదడు ఆరోగ్యానికి సామాజిక బంధాలు కీలకమే. నలుగురితో మంచి సంబంధబాంధవ్యాలతో మెదడుకు కావాల్సిన కసరత్తు, భావోద్వేగ సమతౌల్యం లభిస్తాయి. మెదడు దృఢత్వం ఇనుమడిస్తుంది.
- నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటే మెదడు సామర్థ్యాలు పదికాలాల పాటు నిలిచుంటాయి. మెదడు కణాల మధ్య కొత్త కనెక్షన్లు ఏర్పడి సామర్థ్యం ఇనుమడిస్తుంది. సంగీత వాయిద్యం నేర్చుకోవడం, హాబీ మొదలెట్టడం వంటివన్నీ ఇందుకు సహకరిస్తాయి.