Pawan Kalyan: రేపు కొండగట్టు అంజన్నను దర్శించుకోనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan to visit Kondagattu tomorrow

  • ఇప్పటికే హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకున్న పవన్ కల్యాణ్
  • రేపు ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి బయలుదేరనున్న ఏపీ డిప్యూటీ సీఎం
  • మధ్యాహ్నం 11 గంటలకు స్వామివారిని దర్శించుకొని, మొక్కు తీర్చుకోనున్న జనసేనాని
  • తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తారన్న తెలంగాణ జనసేన నేతలు

అంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు కొండగట్టు అంజన్నను దర్శించుకొని, మొక్కు తీర్చుకోనున్నారు. పవన్ కల్యాణ్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయానికి వచ్చి... అక్కడి నుంచి మాదాపూర్‌లోని తన ఇంటికి వచ్చారు. రేపు ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టుకు వెళ్తారు. మధ్యాహ్నం 11 గంటలకు అంజనేయస్వామి వారిని దర్శించుకొని, మొక్కు చెల్లించుకుంటారు. పవన్ కల్యాణ్ రాక కోసం తెలంగాణ జనసేన భారీగా ఏర్పాట్లు చేసింది.

ఈ పర్యటనపై తెలంగాణ జనసేన నేతలు మీడియాతో మాట్లాడారు. పవన్ రేపు ఉదయం ఏడు నుంచి ఏడున్నర గంటల మధ్య పవన్ కల్యాణ్ మాదాపూర్‌లోని తన ఇంటి నుంచి కొండగట్టుకు బయలుదేరుతారని చెప్పారు. ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక మొదటిసారి అంజన్న దర్శనం కోసం వస్తున్నారన్నారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం అమ్మవారి దీక్షలో ఉన్నారని... కాబట్టి అందరూ పోలీసులతో సహకరించాలని కోరారు. జనసేనాని మరోసారి సమావేశం ఏర్పాటు చేసి అందరినీ కలుస్తారని చెప్పారు.

తెలంగాణలో జనసేనను బలోపేతం చేయడానికి పవన్ కల్యాణ్ త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తారన్నారు. ఏపీ ఫలితాల తర్వాత తెలంగాణలో జనసేన మరింత బలంగా ముందుకు సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. జనసేన లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవని పవన్ కల్యాణ్ ఎప్పుడో చెప్పారన్నారు. ఇందులో భాగంగా ఏపీలో తన సత్తా చూపించారని... తెలంగాణలో త్వరలో తన మార్క్ రాజకీయాలు చూపిస్తారన్నారు.

  • Loading...

More Telugu News