Chandrababu: రామోజీరావుకు 'భారతరత్న' సాధించడం మనందరి బాధ్యత: సీఎం చంద్రబాబు

Chandrababu says Bharataratna to Ramaojirao should be responcibility for every one
  • విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభ
  • ఈనాడు పత్రిక ద్వారా రామోజీరావు సమాజహితం కోసం పాటుపడ్డారన్న చంద్రబాబు
  • జీవితాంతం విలువలకు కట్టుబడి బతికారని వెల్లడి
  • ఎవరూ తన వద్దకు రావాలని ఆయన కోరుకోరని స్పష్టీకరణ
  • ఎన్ని కష్టాలు వచ్చినా రాజీ పడే వ్యక్తి కాదని వ్యాఖ్యలు

విజయవాడలో ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. రామోజీరావు ఈనాడు పత్రిక ద్వారా సమాజ హితం కోసం పాటుపడ్డారని తెలిపారు. జిల్లా ఎడిషన్లు తీసుకువచ్చి ఎక్కడికక్కడ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని పేర్కొన్నారు. నటులు, జర్నలిస్టులు, కళాకారులకు జీవితం ఇచ్చారని కొనియాడారు. 

ఒక రంగానికే పరిమితం కాకుండా... పాత్రికేయ, సినీ, ఆహార రంగాల్లో ప్రవేశించి, ప్రతి రంగంలోనూ తనదైన ముద్రను వేయగలిగారని చంద్రబాబు వివరించారు. ప్రియా పచ్చళ్లను 150 దేశాలకు ఎగుమతి చేశారని వెల్లడించారు. రామోజీ ఫిలిం సిటీని అందంగా తీర్చిదిద్దారని, దేశంలోనే గొప్ప పర్యాటక ప్రదేశంగా మలిచారని పేర్కొన్నారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు.

ప్రజాస్వామ్యానికి కష్టం వస్తే నేనున్నానంటూ ముందుకు వచ్చేవారు

రామోజీరావు నీతి, నిజాయతీ అనే విలువలకు కట్టుబడి బతికారు. ప్రజాస్వామ్యం అపహాస్యం అయినప్పుడల్లా... నేనున్నానంటూ ముందుకొచ్చి పోరాడారు. పదవులు ఉంటేనే ప్రజా సేవ చేస్తారని అనుకుంటాం. కానీ రామోజీరావు పదవులు లేకపోయినా ప్రజలకు సేవలు అందించారు. నాడు 1982లో ఎన్టీఆర్ పార్టీ పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయమే లేదు అని అందరూ అనుకుంటున్న సమయంలో పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారంటే అందులో ప్రముఖ పాత్ర రామోజీరావుది. ఆ తర్వాత, ఆగస్టు సంక్షోభం వస్తే అప్పుడు కూడా ప్రజల కోసం రాజీలేని పోరాటం చేశారు. 

దేనికీ రాజీ పడరు... అప్పుడూ ఇప్పుడూ అంతే!

ఆయనను ఇబ్బంది పెట్టాలని మార్గదర్శిపై ఎన్నో కేసులు పెట్టారు. ఎన్నో విధాలుగా హింసించారు. ఆ సమయంలో రామోజీరావు ఒకటే మాటన్నారు. ఇవి నేను సంపాదించిన ఆస్తులు... నేను ప్రజల కోసం పోరాడుతున్నాను... అవసరమైతే ఆస్తులు పోయినా ఫర్వాలేదు కానీ, పోరాటం మాత్రం ఆపను... రాజీపడను అని స్పష్టం చేశారు. ఇలాంటి కేసులు ఉంటే చాలామందిమి భయపడిపోతాం... కానీ భయమన్నది తెలియని వ్యక్తి రామోజీరావు. 86 ఏళ్ల వయసులోనూ బెడ్ పై ఉండి కూడా ప్రజలకు న్యాయం జరగాలని ముందుకొచ్చిన వ్యక్తి రామోజీరావు. 

అమరావతి పేరు సూచించింది రామోజీనే!

నాడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదులో సైబరాబాద్ పేరిట అభివృద్ధి చేశాను. సైబరాబాద్ అభివృద్ధిలో రామోజీరావు పాత్ర కూడా ఉంది. ఆయన సూచనలు కూడా తీసుకుని సైబరాబాద్ కు రూపకల్పన చేశాను. 

ఇక, రాష్ట్ర విభజన జరిగాక ఏపీ రాజధానికి ఏ పేరు పెట్టాలని నేను అనుకున్నప్పుడు ఆయన ఒక రీసెర్చ్ చేసి... మీరు ఏ పేరంటే ఆ పేరు పెడితే కరెక్ట్ కాదు... రాజధానికి అమరావతి అనే పేరు పెట్టండి అని సూచించడమే కాదు, ఆ పేరు ఎందుకు పెట్టాలో నాకు సోదాహరణంగా వివరించి చెప్పారు. ఆ విధంగా ఏపీ రాజధానికి అమరావతి అని పేరు పెట్టాక, ఆ పేరు ప్రపంచమంతా మార్మోగిపోయింది. ఆ నగరాన్ని ప్రజలు నూటికి నూరు శాతం ఆమోదించారు. 

అమరావతి గత ఐదేళ్లుగా ఇబ్బందులు పడింది... అయితే ఏ మాత్రం అనుమానం లేదు... రాబోయే రోజుల్లో అమరావతి దశ దిశ మారుతుంది... ఈ అమరావతి నగరం తెలుగుజాతి ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతుంది. 

నాకు ఇది కావాలని ఎవరినీ అడిగే వ్యక్తి కాదు

రామోజీరావు అందరికీ సూచనలు ఇస్తారు. ఆయన ఎవరినీ పిలవరు. ఎవరూ రావాలని కోరుకోరు... కానీ ఎవరైనా వస్తే తగిన గౌరవం ఇవ్వడం, నిజాయతీగా తనకు తోచిన అభిప్రాయాలను వెల్లడించడం ఆయనకు అలవాటు. కొన్ని దినపత్రికలు చూస్తుంటాం... తమకు అనుకూల పార్టీ కాకుండా వేరే పార్టీ వార్తలు వేయరు. కానీ రామోజీరావు ఏ పార్టీ అనేది పట్టించుకోకుండా వార్తలు వేస్తారు. వార్తల కవరేజిలో ఆయన తప్పు చేయడం నాకు తెలియదు. 

తన సొంత అభిప్రాయాలు ఏమైనా ఉంటే ఎడిటోరియల్ పేజీలో వెల్లడిస్తారే తప్ప, ఏదైనా తప్పు జరిగితే ఎండగడతారే తప్ప, అవతల వ్యక్తులు చెప్పిన విషయాలను కట్ చేసిన సందర్భాలు లేవు. నాతోనూ ఆయన నిబద్ధతతో వ్యవహరించారు. మీ వల్ల నా స్వేచ్ఛకు భంగం కలగకూడదు, నా వల్ల మీ స్వేచ్ఛకు భంగం కలిగించను... నేను మిమ్మల్ని ఏమీ అడగను, మీరు కూడా నా నుంచి ఏమీ కోరుకోవద్దు అని చెప్పి... 40 ఏళ్ల పాటు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తి రామోజీరావు. 

పనిచేస్తూనే చనిపోవాలని...!

పనిచేస్తూనే చనిపోవాలన్నది ఆయన కోరిక. చివరి వరకు ఆయన పనిచేస్తూనే ఉన్నారు. చనిపోవడం తథ్యం అని తెలిశాక, తన అంత్యక్రియలు ఎక్కడ చేయాలో కూడా చెప్పారు. ప్రజలకు స్ఫూర్తిగా నిలవాలన్న రామోజీరావు ఆకాంక్ష నెరవేరిందని భావిస్తున్నా. ఆయనకు తెలుగుభాష అంటే ఎనలేని అభిమానం, తెలుగుజాతి అంటే ఎనలేని ఆప్యాయత. తెలుగుజాతి బాగుండాలని, భారతదేశం బాగుండాలని, విలువలతో కూడిన సమాజం ఉండాలని నిరంతరం పరితపించిన వ్యక్తి రామోజీరావు. 

ఇప్పుడే రాజమౌళి కూడా ఒక మాట చెప్పారు. రామోజీరావు చేయాల్సిందంతా చేశారు.... ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలంటే మనమేం చేయాలి అన్నారు. ఏపీ, తెలంగాణలో ఉండే తెలుగువారందరికీ చెబుతున్నా... ఈ వ్యవస్థ చిరస్థాయిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ఘనతర వారసత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. 

ఎన్టీఆర్ తో పాటు రామోజీరావుకు కూడా భారతరత్న ఇవ్వాలి

రామోజీరావు స్థాపించిన వ్యవస్థ ఆయన కుటుంబానిదే కాదు, 10 కోట్ల తెలుగు ప్రజలది. ఆయన ప్రజల ఆస్తి. ఆయన స్థాపించిన వ్యవస్థలను భావితరాలకు అందించే బాధ్యతను కుటుంబ సభ్యులు తీసుకుంటే... మనందరం కలిసి ఆయన స్ఫూర్తి ఎల్లప్పుడూ తెలుగుజాతిలో ఉండేలా ఆలోచించాలి. 

ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని మనం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. అదేవిధంగా, రామోజీరావుకు కూడా భారతరత్న సాధించడం మనందరి బాధ్యత. ఒక్క ఎన్టీఆర్, మరోపక్క రామోజీరావు... ఇద్దరూ ఇద్దరే. అలాంటి మహానాయకులకు, యుగపురుషులకు  మనం నివాళులు అర్పించడం అంటే ఇలాంటి కార్యక్రమంలో భాగస్వామ్యం కావడమే. 

అమరావతిలో రామోజీరావు విజ్ఞాన కేంద్రం

అమరావతిలో రామోజీరావు పేరిట విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తాం. ఢిల్లీలో ఉన్న విజ్ఞాన్ భవన్ తరహాలో... సమావేశాలు, పరిశోధనలు, అధ్యయనాలు, ప్రభుత్వ కార్యక్రమాలకు వేదికగా నిలిచే విధంగా రామోజీ విజ్ఞాన కేంద్రం తీర్చిదిద్దుతాం. ఒక రోడ్డుకు కూడా రామోజీరావు మార్గ్ అని నామకరణం చేస్తాం. 

రామోజీరావు మొదటిగా పేపరు పెట్టి ప్రస్థానం ప్రారంభించింది విశాఖలో. అందుకే విశాఖలో చిత్రనగరి అనే పేరు పెట్టి సినిమా షూటింగ్ ల కోసం అందుబాటులోకి తీసుకువస్తాం. దీనికి కూడా రామోజీరావు పేరు మీదే రామోజీరావు చిత్రనగరి అని పేరుపెడతాం. 

ఇది నాకు దక్కిన అదృష్టం 

ఎందరో పుడతారు, ఎందరో చనిపోతారు... కానీ కొందరే చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి మహనీయ వ్యక్తి రామోజీరావు... ఆయన సంస్మరణ సభ నిర్వహించడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తాను. నాడు ఎన్టీఆర్ చనిపోయినప్పుడు ఎన్టీఆర్ మెమోరియల్ కట్టాం... ఇప్పుడు రామోజీరావు మెమోరియల్ కోసం ఏం చేయాలో ప్రజలు సూచనలు, సలహాలు ఇవ్వాలి... దీనిపై రామోజీరావు కుటుంబ సభ్యులతో కూడా చర్చించి మెమోరియల్ నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటాం" అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News