Vangalapudi Anitha: ఖాకీ చొక్కా వేసుకుని రాజకీయాలు చేయొద్దు: పోలీసులకు హోంమంత్రి అనిత హెచ్చరిక

Home minister Anitha warns Police do not indulge in politice while wearing uniform
  • విశాఖలో పర్యటించిన హోంమంత్రి అనిత
  • పోలీసులు తమ పని తాము చేయాలని అనిత కర్తవ్యబోధ
  • రాజకీయాలు చేసేట్టయితే ఖాకీ వదిలి ఖద్దరు వేసుకోవాలని వ్యాఖ్యలు
  • రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసుకువస్తామని వెల్లడి

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఇవాళ విశాఖపట్నం వచ్చారు. ఇక్కడి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు రాజకీయాల జోలికి వెళ్లొద్దు అని స్పష్టం చేశారు. పోలీసులూ... మీ పని మీరు చేయండి... ఖాకీ చొక్కాలు వేసుకుని రాజకీయాలు చేయొద్దు అని హెచ్చరించారు. ఖాకీ చొక్కా వేసుకుని రాజకీయాలు చేసేట్టయితే ఖద్దరు చొక్కా వేసుకోండి అని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు. 

రాష్ట్రంలో స్నేహపూర్వక పోలీసింగ్ విధానం అమలు కావాలని, ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకం కలిగేలా వ్యవహరించాలని సూచించారు. గత ఐదేళ్లుగా పోలీసులు అంటే ఒక విధమైన ముద్ర పడిపోయిందని విచారం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల వారిని ఇబ్బంది పెట్టేందుకో, వాళ్ల ఇళ్ల వద్ద కాపు కాయడానికో, ప్రతిపక్షాల వారిని అరెస్ట్ చేయడానికో, ప్రతిపక్షాల వారిని భయాందోళనలకు గురిచేయడానికో తప్ప వేరే పనులకు ఉపయోగించని పరిస్థితి కనిపించిందని అనిత వివరించారు.

 కానీ ఇప్పుడు అలా జరిగే పరిస్థితి లేదని, కచ్చితంగా పోలీస్ డిపార్ట్ మెంట్ లో సంస్కరణలు తీసుకువస్తామని చెప్పారు. డిపార్ట్ మెంట్ హ్యాపీగా ఉండాలి, ప్రజలు హ్యాపీగా ఉండాలి... ఈ రెండింటి మధ్య సమతూకం సాధిస్తూ ముందుకు వెళతామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క పోలీస్ ఉద్యోగం కూడా ఇవ్వలేదని, తాము పోలీస్ రిక్రూట్ మెంట్ కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

ఇక, సోషల్ మీడియాలో మహిళలపై దుష్ప్రచారాలు చేసేవారిపై కఠినచర్యలు ఉంటాయని, తాను కూడా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టుల బాధితురాలినేనని తెలిపారు. కాగా, గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా అనేక ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టులో ఉన్నాయని, ఇప్పుడు తాను మాట్లాడుతున్న సీపీ కార్యాలయం కూడా తాకట్టులో ఉందో, లేదో చూడాలని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. విశాఖ జిల్లాలో ఇప్పటికీ ఒక పోలీస్ స్టేషన్ రేకుల షెడ్డులోనే నడుస్తోందని వెల్లడించారు. 

గత ప్రభుత్వ హయాంలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, కేంద్రం నుంచి నిధులు వచ్చినప్పటికీ సద్వినియోగం చేయలేదని విమర్శించారు.

  • Loading...

More Telugu News