Chris Silverwood: శ్రీలంక ప్రధాన కోచ్ పదవికి క్రిస్ సిల్వర్‌వుడ్ రాజీనామా!

Chris Silverwood resigns as Sri Lanka head coach

  • వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేసినట్లు ఎస్ఎల్‌సీ ప్ర‌క‌ట‌న‌
  • కన్సల్టెంట్ కోచ్‌ మహేల జయవర్ధనే రిజైన్ చేసిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే సిల్వర్‌వుడ్ రాజీనామా
  • టీ20 ప్రపంచకప్‌లో జ‌ట్టు ఘోర ప్ర‌ద‌ర్శ‌నకు బాధ్య‌త వ‌హిస్తూ ఇరువురి నిష్క్ర‌మ‌ణ‌

శ్రీలంక క్రికెట్ ప్రధాన కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేసినట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు (ఎస్ఎల్‌సీ) గురువారం ప్రకటించింది. టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక జ‌ట్టు ఘోర ప్ర‌ద‌ర్శ‌న కార‌ణంగా సూపర్-8కి అర్హత సాధించడంలో విఫలమైంది. దాంతో కన్సల్టెంట్ కోచ్‌గా ఉన్న‌ మహేల జయవర్ధనే రాజీనామా చేశారు. ఆయ‌న రాజీనామా చేసిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే సిల్వ‌ర్ వుడ్ కూడా హెడ్ కోచ్‌గా నిష్క్ర‌మించ‌డం గ‌మనార్హం. 

"అంతర్జాతీయ కోచ్‌గా ఉండటం అంటే చాలా కాలం పాటు సొంత‌వారికి దూరంగా ఉండాలి. నా కుటుంబంతో సుదీర్ఘ చ‌ర్చ‌ తర్వాత నేను భారమైన హృదయంతో ఈ నిర్ణ‌యం తీసుకుంటున్నాను. నేను స్వదేశానికి తిరిగి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నాను. శ్రీలంక క్రికెట్‌లో భాగం కావడం నాకు నిజమైన గౌరవం. నేను ఇక్క‌డ ఎన్నో మధురమైన జ్ఞాపకాలను కూడ‌గ‌ట్టుకున్నాను అని సిల్వర్‌వుడ్ పేర్కొన్న‌ట్లు ఎస్ఎల్‌సీ త‌న ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

ఇక‌ 2022 ఏప్రిల్ లో శ్రీలంక పురుషుల జట్టుకు ప్రధాన కోచ్‌గా సిల్వర్‌వుడ్ ఎంపికయ్యాడు. ఆయ‌న బాధ్య‌త‌లు చేప‌ట్టాక ఆ ఏడాది శ్రీలంక ఆసియా క‌ప్ గెలిచింది. అటు దేశం ఆర్థిక సంక్షోభం సమయంలో ఆయ‌న ఆస్ట్రేలియాతో స్వదేశంలో జ‌రిగిన వ‌న్డే ద్వైపాక్షిక సిరీస్ (3-2)  విజయాన్ని అదించాడు. 2023 ఆసియా కప్‌లో శ్రీలంక రన్నరప్‌గా నిలిచింది. అయితే, గత ఆరు నెలల్లో రెండు ప్రపంచ కప్ (వ‌న్డే, టీ20) ల‌లో శ్రీలంక ఘోర ప‌రాభ‌వాన్ని చవిచూసింది. లీగ్ ద‌శ నుంచే నిష్క్ర‌మించింది. ఈ నేప‌థ్యంలోనే సిల్వర్‌వుడ్, మహేల జయవర్ధనే త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు.

  • Loading...

More Telugu News