Lightning: బీహార్‌లో షాకింగ్ ఘ‌ట‌న‌.. త్రుటిలో పిడుగుపాటు నుంచి తప్పించుకున్న బాలిక.. వైర‌ల్ వీడియో!

Girl narrowly escapes lightning strike while making reel in Sitamarhi Video goes Viral

  • బీహార్‌లోని సీతామర్హిలో ఘ‌ట‌న
  • ఇన్‌స్టా రీలు కోసం పొరుగింటి వారి టెర్రస్‌పైకి ఎక్కిన బాలిక‌
  • అదే స‌మ‌యంలో ఆమె స‌మీపంలో ప‌డ్డ పిడుగు
  • ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో నెట్టింట వైర‌ల్

బీహార్‌లోని సీతామర్హిలో షాకింగ్ ఘ‌ట‌న వెలుగు చూసింది. వ‌ర్షం ప‌డుతున్న స‌మ‌యంలో ఇన్‌స్టా రీలు కోసం పొరుగింటి వారి టెర్రస్‌పైకి ఎక్కిన ఓ బాలిక‌ పిడుగుపాటు నుంచి త్రుటిలో తప్పించుకుంది. ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

వివ‌రాల్లోకి వెళితే.. సీతామర్హి ప‌రిధిలోని పరిహార్‌లోని సిర్సియా బజార్‌లో సానియా కుమారి అనే బాలిక‌ తన పొరుగున ఉండే దేవనారాయణ్ భగత్ ఇంటి టెర్ర‌స్‌పై వర్షంలో డ్యాన్స్ చేయడం మొదలెట్టింది. ఆమె స్నేహితురాలు దాన్ని వీడియో తీస్తోంది. ఇంత‌లోనే సానియాకు సమీపంలోనే పిడుగు పడింది. అదృష్టవశాత్తూ ఆమెకు నేరుగా ఆ పిడుగు ప్ర‌భావం తగలకపోవడంతో ఎలాంటి ప్రమాదం జ‌ర‌గ‌లేదు. ఈ ఘ‌ట‌నకు సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. 

బీహార్‌లో 24 గంటల్లో పిడుగుపాటుకు 8 మంది మృతి
బీహార్‌లోని ప‌లు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పిడుగుపాటు ఘ‌ట‌న‌లు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో బీహార్‌లోని ఆరు జిల్లాల్లో పిడుగుపాటుతో కనీసం 8 మంది చ‌నిపోయినట్లు బుధ‌వారం అధికారులు తెలిపారు. ఇక వ‌ర్ష‌ ప్రభావిత జిల్లాల్లో భాగల్‌పూర్, ముంగేర్, జముయి, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, అరారియా ఉన్నాయి.

మృతుల కుటుంబాల‌కు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం నితీశ్‌ కుమార్  
మృతుల పట్ల బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. భాగల్‌పూర్, ముంగేర్‌లలో ఇద్దరు చొప్పున‌ మరణించగా.. జముయి, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, అరారియాలలో ఒక్కొక్కరు చనిపోయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) వెల్ల‌డించింది.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ విపత్తు నిర్వహణ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ఈ సంద‌ర్భంగా సీఎం గుర్తు చేశారు. అత్యవ‌స‌ర‌మైతే త‌ప్ప ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని, ఇంట్లోనే ఉండాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు. 

తూర్పు రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో రాబోయే ఐదు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల (30-40 కి.మీ.)తో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.

  • Loading...

More Telugu News