US House of Representatives: పాక్ ఎన్నికల్లో అవకతవకలపై దర్యాప్తు కోరుతూ అమెరికా తీర్మానం

US representatives resolution on pakistan for protecting democracy and upholding human rights

  • భారీ మెజారిటీతో ఆమోదించిన అమెరికా ప్రతినిధుల సభ
  • ప్రజాస్వామ్య పరిరక్షణకు అమెరికా ప్రభుత్వం పాక్‌తో కలిసి పనిచేయాలని పిలుపు
  • ప్రజాస్వామ్య ప్రక్రియలను పక్కదారి పట్టించే ప్రయత్నాలను ఖండించిన ప్రతినిధుల సభ
  • అమెరికా తీర్మానంపై పాక్ గుస్సా

పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం, మానవహక్కుల పరిరక్షణ కోరుతూ చేసిన తీర్మానానికి అమెరికా ప్రతినిధుల సభ భారీ మెజారిటీతో ఆమోదం తెలిపింది. ఈ ఫిబ్రవరిలో జరిగిన పాక్ సార్వత్రిక ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు జరగాలని ప్రతినిధుల సభ సభ్యులు తీర్మానించారు. ఆ దిశగా అమెరికా ప్రభుత్వం పాక్‌తో కలిసి పనిచేయాలని కోరారు. ‘ఎక్స్‌ప్రెసింగ్ సపోర్టు ఫర్ డెమోక్రసీ అండ్ హ్యూమన్ రైట్స్ ఇన్ పాకిస్థాన్’ పేరిట చేసిన ఈ తీర్మానానికి 268 మంది సభ్యులు అనుకూలంగా, ఏడుగురు వ్యతిరేకంగా ఓటు వేశారు. 

ఎన్నికలు చట్టబద్ధంగా న్యాయంగా జరగాలని ఈ సందర్భంగా అమెరికా ప్రతినిధుల సభ సభ్యులు పేర్కొన్నారు. ఎన్నికలపై స్వతంత్ర దర్యాప్తు అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పాక్ ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాలన్నారు. రాజకీయ, న్యాయ, ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియలను పక్కదారి పట్టించే ప్రయత్నాలను ముక్తకంఠంతో ఖండించారు. ప్రజాస్వామ్య ప్రక్రియల్లో ప్రజల భాగస్వామ్యాన్ని తగ్గించే అన్ని చర్యలను ఖండించారు. వేధింపులు, బెదిరింపులు, హింస, అకారణ నిర్బంధాలు, ఇంటర్నెట్, ఫోన్ వ్యవస్థలపై ఆంక్షలు, రాజకీయ, పౌర మానవ హక్కుల ఉల్లంఘనలకు ప్రజాస్వామ్యంలో తావు లేదన్నారు. 

ఇటీవల జరిగిన పాక్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా తీవ్ర హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాల విడుదలలో కూడా భారీ జాప్యం జరగడంతో రిగ్గింగ్ జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కాగా, ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పీటీఐ ఈ ఎన్నికల ఫలితాలను తిరస్కరించింది. ఎన్నికలకు ముందు పాక్ ఎలక్షన్ కమిషన్‌‌తో వివాదం కారణంగా పీటీఐ తన బ్యాట్ పార్టీ గుర్తును వినియోగించుకోలేకపోయింది. చివరకు తమ నేతలను స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిపింది. అయితే, పీటీఐ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థులు భారీ సంఖ్యలో గెలుపొందింది. కానీ నవాజ్ షరీఫ్‌కు చెందిన అవామీ లీగ్, బిలావాల్ భుట్టో నేతృత్వంలోని పీపీపీ కూటమి కట్టి అధికార పగ్గాల్ని చేపట్టడంతో పీటీఐ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. 

మరోవైపు, అమెరికా ప్రతినిధుల సభ తీర్మానంపై పాకిస్థాన్ అగ్గిమీద గుగ్గిలమైంది. పాక్ రాజకీయ పరిస్థితులు, ఎన్నికల ప్రక్రియపై అవగాహన లేమికి ఈ తీర్మానం అద్దంపట్టిందని అక్కడి ప్రభుత్వం విమర్శించింది.

  • Loading...

More Telugu News