Pinnelli Ramakrishna Reddy: నెల్లూరు సెంట్రల్ జైలుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి.. జైలు బయట భారీ భద్రత

YCP leader Pinnelli Ramakrishna Reddy sent to Nellore Central Jail
  • పిన్నెల్లి పెట్టుకున్న నాలుగు బెయిల్ పిటిషన్లు కొట్టవేయడంతో అరెస్ట్
  • గత రాత్రి 10 గంటల సమయంలో మాచర్ల కోర్టుకు తరలింపు
  • 14 రోజుల రిమాండ్ విధించిన మాచర్ల కోర్టు
  • భారీ భద్రత మధ్య సెంట్రల్ జైలుకు తరలింపు

ఈవీఎం ధ్వంసం కేసుతోపాటు మరికొన్ని కేసుల్లో అరెస్ట్ అయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తాజాగా నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. పిన్నెల్లి పెట్టుకున్న నాలుగు బెయిలు పిటిషన్లను నిన్న హైకోర్టు కొట్టివేసిన వెంటనే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి ఎస్పీ కార్యాలయానికి తరలించారు. రాత్రి పది గంటల సమయంలో మాచర్ల కోర్టుకు తరలించారు. 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో తాజాగా, భారీ భద్రత మధ్య నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. జైలుకు వెళ్లే మార్గంతోపాటు జైలు బయట పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన మే 13న రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లిన పిన్నెల్లి ఈవీఎంను ఎత్తి నేలకేసి కొట్టి విధ్వంసం సృష్టించారు. లోపల ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేసిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడిచేశారు. పోలింగ్ కేంద్రం బయట చెరుకూరి నాగశిరోమణి అనే మహిళ నిలదీయడంతో ఆమెను హెచ్చరించి దుర్భాషలాడారు.

ఈ ఘటనలపై కేసు నమోదు కాగా, తొలుత ఆయన పరారయ్యారు. ఆ తర్వాత కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో తిరిగి మాచర్ల చేరుకున్నారు. ఆయనపై నమోదైన నాలుగు కేసుల్లో బెయిలుకు దరఖాస్తు చేసుకోగా హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.

  • Loading...

More Telugu News