Foxconn Discrimination: పెళ్లయిన మహిళల్ని ఉద్యోగంలోకి తీసుకోని ఫాక్స్‌కాన్.. రంగంలోకి కేంద్రం!

Centre seeks report on reuters article on Foxconn discrimination against married woman while hiring in Tamilnadu

  • భారత్‌లోని ఫాక్స్‌కాన్ వివాహితలపై వివక్ష చూపుతున్నట్టు రాయిటర్స్ సంచలన కథనం
  • పెళ్లయిన మహిళలను ఉద్యోగంలోకి తీసుకోవట్లేదని ఆరోపణ
  • ప్రెగ్నెన్సీ, కుటుంబ బాధ్యతలతో వివాహితలు సెలవులు ఎక్కువగా తీసుకుంటారని ఫాక్స్‌కాన్ భావన
  • ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని కోరిన కేంద్రం

యాపిల్ సరఫరాదారు ఫాక్స్‌కాన్ తమిళనాడులోని శ్రీ పెరంబదూరు కార్యాలయంలో పెళ్లయిన మహిళలను ఉద్యోగాలలోకి తీసుకోవట్లేదన్న రాయిటర్స్ వార్తాసంస్థ కథనంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దీంతో, వివాహితల వివక్షకు సంబంధించి సవివరమైన నివేదిక ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది.  ఈ ఘటనపై వాస్తవ నివేదిక ఇవ్వాలని కూడా కార్మిక మంత్రిత్వ శాఖ ప్రాంతీయ లేబర్ కమిషనర్‌ను ఆదేశించింది. 

మంగళవారం రాయిటర్స్ ప్రచురించిన కథనం ప్రకారం, ఫాక్స్‌కాన్.. తమిళనాడులోని తన ప్రధాన యాపిల్ ఫోన్ల తయారీ కేంద్రంలో కావాలనే వివాహిత మహిళలను ఉద్యోగంలోకి తీసుకోవట్లేదు. అవివాహితుల కంటే వివాహిత మహిళలకు కుటుంబ బాధ్యతలు ఎక్కువ ఉంటాయన్న కారణంతో వారిని దూరం పెడుతోంది. కుటుంబ బాధ్యతలు, ప్రెగ్నెన్సీ, సెలవులు ఎక్కువగా తీసుకోవడం వంటి కారణాలతో వివాహితలకు జాబ్ ఇచ్చేందుకు తాము వెనకాడినట్టు రాయిటర్స్‌తో ఫాక్స్‌కాన్ హైరింగ్ ఏజెంట్స్, హెచ్ఆర్ వర్గాలు తెలిపాయి.

మరోవైపు, 2022 నాటి నియామకాల్లో లోపాలు ఉన్నట్టు యాపిల్, ఫాక్స్‌కాన్ సంస్థలు రాయిటర్స్‌ ముందు అంగీకరించాయి. తొలిసారి ఆరోపణలు రాగానే తాము దిద్దుబాటు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నాయి. అయితే, తాజా కథనంలో రాయిటర్స్ పేర్కొన్న వివక్ష పూరిత ఘటనలు 2023, 2024లో జరిగిన నియామకాల్లో చోటుచేసుకున్నాయి. అయితే, వీటి గురించి మాత్రం ఆ కంపెనీలు ప్రస్తావించలేదు. నియామకాలకు సంబంధించి నెలవారీ సమీక్ష నిర్వహించాలని ఫాక్స్‌కాన్‌ను కూడా ఆదేశించినట్టు యాపిల్ వెల్లడించింది. 

ఫాక్స్‌కాన్ మాత్రం రాయిటర్స్ వార్తాకథనాన్ని తోసిపుచ్చింది. నియామకాలకు సంబంధించి పెళ్లి, వయసు, మతం, లేదా ఇతరత్రా ఎలాంటి వివక్షకూ తావులేదని పేర్కొంది. స్త్రీపురుషుల సమానత్వానికి సంబంధించి ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్ 1976 ప్రకారం, ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి వివక్ష చూపరాదు.

  • Loading...

More Telugu News