India vs England: ఇండియా-ఇంగ్లండ్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న స్టేడియం ఎవరికి అనుకూలం?.. ట్రాక్ రికార్డు ఇదే!

Providence Stadium likely to assist spinners and India and England Playing Semi Final match in this Stadium
  • స్పిన్నర్లకు సహకరిస్తున్న పిచ్
  • వర్షం పడితే పేసర్లకు అనుకూలించే అవకాశం
  • ఫస్ట్ బ్యాటింగ్ జట్టు సగటు స్కోరు కేవలం 133 పరుగులు
  • రాత్రి 8 గంటలకు భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ పోరు

టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా నేడు కీలకమైన పోరు జరగనుంది. ఫైనల్ బెర్త్ కోసం రెండవ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్-ఇంగ్లండ్ తలపడనున్నాయి. 2022 టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్ మాదిరిగానే మళ్లీ ఈ రెండు జట్లు సెమీస్‌లో తలపడుతుండడం ఆసక్తిని రేపుతోంది.

టోర్నమెంట్‌లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లోనూ గెలిచిన టీమిండియా మంచి దూకుడు మీద కనిపిస్తోంది. ఇక రెండు ఓటములు ఉన్నప్పటికీ సెమీస్ చేరిన ఇంగ్లండ్ మరోసారి ఫైనల్ చేరాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే అత్యంత కీలకమైన ఈ సెమీస్ మ్యాచ్‌కు గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రస్తుత టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఇక్కడ మొత్తం 5 మ్యాచ్‌లు జరిగాయి. కొన్ని బలమైన జట్లు ఇక్కడ సత్తా చాటలేకపోయాయి. పూర్తి సామర్థ్యాలను ప్రదర్శించడంలో విఫలమయ్యాయి. ఈ పిచ్ స్పిన్నర్లకు సహకారం అందించే అవకాశం ఉంది. లీగ్ దశలో అదే జరిగింది. ఇదే వేదికగా న్యూజిలాండ్‌పై ఆఫ్ఘనిస్థాన్ సంచలన విజయం సాధించింది.

ఈ పిచ్‌పై పలువురు స్పిన్నర్లు 5 వికెట్ల ప్రదర్శనను నమోదు చేశారు. వెస్టిండీస్ ప్లేయర్ అకేల్ హోసేన్ 5 వికెట్లు, రషీద్ ఖాన్ 6 వికెట్లు తీశారు. ఈ గణాంకాలను బట్టి పిచ్ స్పిన్నర్లకు ఎంత అనుకూలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక వాతావరణ శాఖ అంచనాల ప్రకారం వర్షం పడితే పేసర్లకు కూడా సహకారం లభించే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

స్టేడియం ట్రాక్ రికార్డు ఇదే..
ప్రొవిడెన్స్ స్టేడియంలో ఇప్పటివరకు 18 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 6 సార్లు, లక్ష్య ఛేదన చేసిన జట్లు 9 సార్లు విజయాలు సాధించాయి. ఇక ఈ గ్రౌండ్‌లో శ్రీలంక ఆటగాడు మహేల జయవర్ధనే సాధించిన 100 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉంది. 2010లో జింబాబ్వేపై ఈ రికార్డును నెలకొల్పాడు. ఇక్కడ అత్యధిక జట్టు స్కోరు 191/5గా ఉంది. 2010లో ఈ స్కోరును వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ నమోదు చేసింది. అత్యల్ప స్కోరు 39గా (ఉగాండా) ఉంది. 2024 వరల్డ్ కప్‌లో భాగంగా వెస్టిండీస్ చేతిలో ఉగాండా ప్లేయర్లు 39 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఇక ఈ స్టేడియంలో అత్యధిక లక్ష్య ఛేదన 169/5గా ఉంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు సగటు స్కోరు ఇక్కడ 133 పరుగులుగా ఉంది.

  • Loading...

More Telugu News