Kodandaram: కేసీఆర్ కేసులు ఎత్తివేయాలని కోరడం బాధ్యతారాహిత్యం... అలా అయితే మా కేసులూ ఎత్తివేయాలి: కోదండరాం
- బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని కేంద్రానికి కోదండరాం విజ్ఞప్తి
- మేడిగడ్డ డిజైన్ ఒకటైతే... నిర్మాణం మరోరకంగా చేశారని ఆరోపణ
- విచారణ కమిటీని రద్దు చేయించి వాస్తవాలు బయటకు రాకుండా చేస్తున్నారని విమర్శ
పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్... ఇప్పుడు తనపై కేసులు ఎత్తివేయాలని కోరడం బాధ్యతారాహిత్యమని తెలంగాణ జన సమితి చైర్మన్ కోదండరాం అన్నారు. అప్పుడు బీఆర్ఎస్ పాలనలో తమపై నమోదైన కేసులు కూడా ఎత్తివేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. బొగ్గు గనులను వేలం వేస్తే ప్రైవేటీకరణకు దారి తీస్తుందన్నారు. బొగ్గు గనులను సింగరేణికి అప్పగించాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
మేడిగడ్డ డిజైన్ ఒకటైతే... నిర్మాణం మరో రకంగా చేశారని... దీంతో ఆ ప్రాజెక్టు కుంగిపోయిందని విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టడం మంచిది కాదని చెప్పినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీఇంజినీరింగ్‌కు ముందు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సుజల స్రవంతి పేరుతో ప్రారంభించారన్నారు. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు సరికాదని చెప్పినా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి సిద్ధమైందన్నారు.
ఆర్థికపరమైన అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఇప్పటికే క్యాట్ చెప్పిందన్నారు. మేడిగడ్డ డిజైన్ ఒకటైతే నిర్మాణం మరో రకంగా చేయడంతో కుంగిపోయినట్లు చెప్పారు. నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ కూడా సక్రమంగా లేదన్నారు. నిర్వహణ లేమి కనిపించినట్లు డ్యాం సేఫ్టీ అధికారులు చెప్పారని తెలిపారు. తుమ్మిడిహట్టి నుంచి కాలువల ద్వారా నీరు తీసుకురాగలిగితే గతంలో ఖర్చు చేసిన నిధులకు సార్థకత దక్కుతుందన్నారు.
తుమ్మిడిహట్టిని పరిశీలించాలని ప్రభుత్వం, కమిషన్‌ను కోరినట్లు కోదండరాం చెప్పారు. ఇంజినీర్ల సూచనలను గత ప్రభుత్వం బేఖాతరు చేసిందన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన వారిని గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. విచారణ కమిషన్ వేయాలని బీఆర్ఎస్సే కోరిందని తెలిపారు. కమిషన్ వేస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయని అసెంబ్లీ వేదికగా ఆ పార్టీయే కోరిందన్నారు. ప్రజల సొమ్మును ఏ ప్రభుత్వమైనా బాధ్యతగా ఖర్చు చేయాలన్నారు. విచారణ కమిటీలను రద్దు చేయించి వాస్తవాలు బయటకు రాకుండా చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వైఖరిని తాను ఖండిస్తున్నానన్నారు.