Jackpot: దుబాయిలో తెలుగు వ్యక్తిని వరించిన అదృష్టం.. ఏకంగా రూ. 2.25 కోట్ల జాక్‌పాట్!

Andhra Electrician Wins above Rs 2 crore Jackpot in Dubai

  • ఉపాధి కోసం 2017లో యూఏఈ వెళ్లిన ఏపీకి చెందిన బోరుగడ్డ నాగేంద్రం
  • బ్యాంకుల్లో సేవింగ్స్‌ స్కీమ్‌ చందాదారులకు నిర్వ‌హించిన‌ లక్కీ డ్రాలో విజేత‌గా నిలిచిన వైనం
  • దుబాయిలో ఎలక్ట్రీషియన్‌గా ప‌నిచేస్తూ జీవనం సాగిస్తున్న నాగేంద్రం

ఉపాధి కోసం యూఏఈలోని దుబాయి వెళ్లిన ఏపీకి చెందిన ఓ తెలుగు వ్యక్తిని అదృష్టం వ‌రించింది. నెలనెలా తాను చేసిన పొదుపుతో ఏకంగా రూ. 2.25 కోట్లు గెలుచుకున్నాడు. బ్యాంకుల్లో సేవింగ్స్‌ స్కీమ్‌ చందాదారులకు ఆఫర్ కింద లక్కీ డ్రా నిర్వహించగా అందులో మ‌నోడు విజేత‌గా నిలిచాడు. దీంతో 46 ఏళ్ల ఎలక్ట్రీషియన్ బోరుగడ్డ నాగేంద్రం దుబాయిలో 1 మిలియన్ (సుమారు రూ. 2.25 కోట్లు) క్యాష్ ప్రైజ్‌ను సొంతం చేసుకున్న‌ట్లు 'ఖలీజ్ టైమ్స్' వెల్ల‌డించింది. 

ఏపీకి చెందిన బోరుగడ్డ నాగేంద్రం అనే వ్యక్తి ఉపాధి కోసం 2017లో యూఏఈ వెళ్లాడు. దుబాయిలో ఎలక్ట్రీషియన్‌గా ప‌నిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అలా కరెంటు పని చేస్తున్న ఆయన 2019 నుంచి తాను సంపాదించిన జీతం నుంచి నెల నెలా కొంత డబ్బు (దాదాపు 100 యూఏఈ దిర్హ‌మ్స్‌) ను నేషనల్‌ బాండ్స్‌లో పొదుపు చేస్తూ వచ్చాడు. అయితే, ఈ సేవింగ్ స్కీమ్‌ కట్టేవారికి బ్యాంకు సదరు నిర్వాహకులు రివార్డు ప్రోగ్రామ్‌ కింద లక్కీ డ్రా తీశారు. ఈ డ్రాలో నాగేంద్రం విజేత‌గా నిల‌వ‌డంతో భారీ మొత్తాన్ని గెలుచుకున్నాడు. నగదు బహుమతిగా రూ. 2.25 కోట్లు అత‌ని సొంత‌మ‌య్యాయి.  

తాను కుటుంబానికి మెరుగైన జీవితాన్ని, పిల్లలకు మంచి విద్యను అందించడానికి యూఏఈకి వచ్చానని నాగేంద్రం 'ఖలీజ్ టైమ్స్‌'తో తెలిపాడు. ఇతనికి 18 ఏళ్ల కుమార్తె, 16 ఏళ్ల కొడుకు ఉన్నారు. ఇంత భారీ మొత్తం గెల‌వ‌డం ప‌ట్ల ఆయ‌న హ‌ర్షం వ్యక్తం చేశాడు. ఆ డబ్బు తన పిల్లల ఉన్నత చదువుల కోసం తనకు అక్కరకు వస్తుందని.. వారి భవిష్యత్తు బంగారంగా ఉంటుందని నాగేంద్రం ఆనందం వ్యక్తం చేశాడు. ఇదే కోవ‌లో ఈ ఏడాది మేలో నిర్వ‌హించిన‌ 'దుబాయ్ డ్యూటీ-ఫ్రీ మిలీనియం' డ్రాలో పంజాబ్‌కు చెందిన ఒక మహిళ 1 మిలియన్ డాల‌ర్లు బహుమతిని గెలుచుకున్న విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News