Budda Venkanna: స్పీకర్ కు జగన్ లేఖ... బహిరంగ లేఖతో బదులిచ్చిన బుద్ధా వెంకన్న

Budda Venkanna counters Jagan with open letter

  • అసెంబ్లీలో విపక్ష హోదాపై స్పీకర్ కు లేఖ రాసిన జగన్
  • నాడు చంద్రబాబుకు విపక్ష నేత హోదా లేకుండా చేయాలనుకున్నారంటూ బుద్ధా ఫైర్
  • మీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది ప్రజలేనని స్పష్టీకరణ

ఏపీ అసెంబ్లీలో తమకు విపక్ష హోదా ఎందుకివ్వరంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వైసీపీ అధ్యక్షుడు జగన్ లేఖ రాయడం తెలిసిందే. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే ఉద్దేశం లేనందువల్లే... ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణం చేసిన తర్వాత తనతో ప్రమాణం చేయించారని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. జగన్ లేఖపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న ఘాటుగా స్పందించారు. జగన్ లేఖకు ఓ బహిరంగ లేఖతో బదులిచ్చారు. 

జగన్ మోహన్ రెడ్డీ... నాడు టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే... నలుగురిని లాక్కుని, ఇంకో ఇద్దరిని కూడా లాక్కుందాం అని ప్రయత్నించి చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేద్దాం అనుకున్నది నువ్వు కాదా? అని బుద్ధా వెంకన్న సూటిగా ప్రశ్నించారు. 

"నువ్వు ఈ లేఖ రాసే ముందు ఓసారి రాజ్యాంగ నిపుణులను కనుక్కోవాల్సింది. ఇంకా నీ పదవీ కాంక్ష తీరలేదా? మీరు... ప్రస్తుత సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, ప్రస్తుత స్పీకర్ అయ్యన్నపాత్రుడు గురించి మాట్లాడలేదా? వాళ్ల గురించి మీరు మాట్లాడిన మాటలు చూస్తే మీకు ప్రతిపక్ష హోదా కాదు కదా... అసెంబ్లీలో కూర్చునే అర్హత కూడా ఉండదు. మీకు ప్రతి పక్ష హోదా లేకుండా చేసింది చంద్రబాబు కాదు... ప్రజలు. ముందు ఈ విషయాన్ని గమనించండి" అంటూ బుద్ధా వెంకన్న తన లేఖలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News