Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హౌస్ అరెస్ట్

BRS MLA Padi Kaushik Reddy House Arrest
  • మంత్రి పొన్నం ప్రభాకర్ పై అవినీతి ఆరోపణలు చేసిన పాడి
  • ఫ్లైయాష్ తరలింపులో రూ.100 కోట్ల ముడుపులు స్వీకరించారని ఆరోపణ
  • ప్రతి విమర్శలకు దిగిన కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి ప్రణవ్
  • చెల్పూర్ లోని హనుమాన్ టెంపుల్ లో ప్రమాణం చేయాలని సవాల్

ఫ్లైయాష్ తరలింపు విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ రూ. వంద కోట్ల అవినీతికి పాల్పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల విమర్శలు ప్రతివిమర్శలు హుజురాబాద్ నియోజకవర్గంలో ఉద్రిక్తతకు దారితీశాయి. ఇరుపార్టీల నేతల సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.  

మంత్రి పొన్నం ప్రభాకర్ పై పాడి కౌశిక్ రెడ్డి చేసిన విమర్శలను కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి ప్రణవ్ తోసిపుచ్చారు. కౌశిక్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తూ చెల్పూర్ హనుమాన్ టెంపుల్‌లో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఈ సవాల్ ను స్వీకరించిన పాడి.. మంగళవారం ఉదయం వీణవంకలోని తన నివాసం నుంచి చెల్పూర్ బయలుదేరగా పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు, ప్రణవ్ కూడా చెల్పూర్ బయలుదేరారు. దీంతో పోలీసులు హనుమాన్ దేవాలయం వద్ద 144 సెక్షన్ ను అమలు చేశారు. హుజురాబాద్, జమ్మికుంట రహదారిలో బారికేడ్లను ఏర్పాటు చేసి కార్యకర్తలను ఎవ్వరినీ అక్కడికి అనుమతించడం లేదు. హనుమాన్ టెంపుల్ చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు.

దేవుడి చిత్రపటంపై కౌశిక్ రెడ్డి ప్రమాణం
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బయటకు వెళ్లనీయకపోవడంతో తాను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు అని కౌశిక్ రెడ్డి ఇంట్లోనే ప్రమాణం చేశారు. కాషాయ వస్త్రాలతో తలస్నానం చేసి, తడిబట్టలతోనే దేవుడి చిత్రపటంపై ప్రమాణం చేశారు. ఫ్లైయాష్ తరలింపులో రూ.100 కోట్ల అవినీతి, ఓవర్ లోడ్ లారీల విషయంలో అవినీతికి పాల్పడలేదని తన మాదిరిగానే ప్రమాణం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఛాలెంజ్ చేశారు. టీటీడీ ఆలయంలో ప్రమాణం చేయడానికీ సిద్ధమని, తానొక్కడినే వస్తానని చెబుతూ.. దమ్ముంటే ప్రమాణం చేసేందుకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News