Ayodhya Ram Temple: అయోధ్య రామాలయం పైకప్పులో లీక్.. తొలి వర్షానికే గర్భగుడిలోకి నీళ్లు

roof of Ayodhya Ram Temples leaking Water just 5 months after inauguration says Reports
  • ప్రారంభించి ఆరు నెలలు కూడా కాకముందే వాటర్ లీక్
  • పూజారి, వీఐపీలు కూర్చొనే చోట లీకేజీలు
  • ఇంజనీర్లపై మండిపడ్డ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్
  • తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించిన అయోధ్య రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్‌

అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ఠ జరిగి ఆరు నెలలు కూడా గడవక ముందే ఆలయ పైకప్పు లీక్ అవుతోంది. శనివారం అర్ధరాత్రి అయోధ్యలో కురిసిన తొలి భారీ వర్షానికి నీళ్లు గర్భగుడిలోకి ప్రవేశించాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకొచ్చాయి. కాగా నీరు లీక్ అవుతోందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ సోమవారం వెల్లడించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన ఇంజనీర్లు రామాలయాన్ని నిర్మిస్తున్నారని, అయినప్పటికీ నీళ్లు లీక్ కావడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని అన్నారు.

ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, గుడి ప్రాంగణంలోకి చేరిన నీరు బయటకు వెళ్లే మార్గం కూడా లేకుండా నిర్మించారని సత్యేంద్రదాస్‌ అన్నారు. రామ్‌లల్లా ముందు పూజారి కూర్చునే చోట, వీఐపీలు దర్శనం చేసుకునే స్థలంలో నీరు లీక్‌ అవుతోందని పేర్కొన్నారు. వర్షం కురవడం ఎక్కువైతే, లోపల కూర్చుని పూజ చేయడం కూడా ఇబ్బందేనని ఆయన పేర్కొన్నారు. నీళ్లు ఇలా ఎందుకు లీక్ అవుతున్నాయని, అంతమంది పెద్ద ఇంజనీర్ల సమక్షంలో నిర్మించిన ఆలయంలో ఇలా జరగడమేంటని ఆయన ప్రశ్నించారు.  ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆలయ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

అయోధ్య రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్‌ స్పందన
గర్భగుడిలోకి నీళ్లు లీక్ అవుతున్నాయనే సమాచారం అందుకున్న అయోధ్య రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్‌ నృపేంద్ర మిశ్రా ఆలయాన్ని పరిశీలించారు. తక్షణమే మరమ్మతులు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మొదటి అంతస్తు నుంచి నీరు కారుతోందని, ఇది ఊహించిందేననీ, రెండో అంతస్తు, శిఖర నిర్మాణం పూర్తయితే గర్భగుడిలోకి వర్షపు నీరు లీక్ కాబోదని ఆయన మీడియాకు వివరించారు. ఆలయ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, మొదటి అంతస్తు నిర్మాణం కొనసాగుతోందని వెల్లడించారు. జులై నాటికి మొదటి అంతస్తు, డిసెంబరు నాటికి మొత్తం నిర్మాణం పూర్తవుతాయని ఆయన పేర్కొన్నారు. కాగా జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News