Jagan: జగన్ మితిమీరిన భద్రత ఏర్పాటు చేసుకున్నారంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులు
- జగన్ సీఎంగా ఉన్నప్పుడు భారీ భద్రత ఏర్పాటు చేసుకున్నారంటున్న ఫిర్యాదుదారులు
- రాష్ట్రపతి, ప్రధానిని మించి భద్రత ఏర్పాటు చేసుకున్నారని ఆరోపణలు
- తన ప్యాలెస్ ల వద్ద 986 మందితో భద్రత
మాజీ సీఎం జగన్ మితిమీరిన భద్రత ఏర్పాటు చేసుకున్నారంటూ ఏపీ ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. రాష్ట్రపతి, ప్రధానమంత్రిని మించిన స్థాయి భద్రత ఏర్పాటు చేసుకోవడం ద్వారా సెక్యూరిటీ మాన్యువల్ ను ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి.
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో... తన ప్యాలెస్ ల వద్ద వందల మందితో భద్రత ఏర్పాటు చేసుకున్నారని, స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ పేరుతో దేశంలోని మరే ముఖ్యమంత్రికి లేని విధంగా వ్యక్తిగత భద్రతా సిబ్బందిని నియమించుకున్నట్టు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్, తాడేపల్లి, పులివెందులలోని ప్యాలెస్ ల వద్ద 986 మందితో నిరంతర భద్రత ఏర్పాటు చేసుకున్నారని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఏ ప్రాంతంలో ఉన్నా తనకు భద్రత ఉండేలా జగన్ ముందస్తు చర్యలు తీసుకున్నట్టు వివరించారు.
తాడేపల్లి ప్యాలెస్ పరిసరాల్లో 48 చోట్ల చెక్ పోస్టులు, ఔట్ పోస్టులు, పోలీస్ పికెట్లు, బారికేడ్లు ఏర్పాటు చేసినట్టు ఫిర్యాదులు అందాయి. జగన్ తన ప్యాలెస్ కు ఆక్టోపస్ కమాండోలతో భద్రత కల్పించుకున్నారని, బూమ్ బారియర్స్, టైర్ కిల్లర్స్, బొల్లార్డ్స్, రిట్రాక్టబుల్ గేట్లు ఏర్పాటు చేసుకున్నారని, తాడేపల్లి ప్యాలెస్ కు 30 అడుగుల ఎత్తున ఐరన్ వాల్ ఏర్పాటు చేసుకున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.
జగన్ భద్రత కోసం నిరంతరాయంగా డ్రోన్లతో పర్యవేక్షణ చేపట్టారని, నివాస ప్రాంతాల్లో డ్రోన్లు ఎగురవేయరాదనే నిబంధన పక్కనపెట్టి సాధారణ ప్రజల నివాసాలపై డ్రోన్లు ఎగురవేశారని వివరించారు. అటు, పోలీసు వర్గాలు ఈ అంశంపై స్పందిస్తూ, జడ్ ప్లస్ క్యాటగిరీ కలిగిన చంద్రబాబు సైతం ఈ స్థాయిలో భద్రత ఏర్పాటు చేసుకోలేదని పేర్కొన్నాయి.