AP Cabinet: ఎన్నికల్లో ఏం చెప్పామో అవన్నీ ఇవాళ క్యాబినెట్ భేటీలో ఆమోదించాం: ఏపీ మంత్రి పార్థసారథి

Minister Parthasarathi explains the details of AP Cabinet meeting

  • సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం
  • క్యాబినెట్ భేటీ వివరాలను మీడియాకు తెలిపిన మంత్రి పార్థసారథి
  • ఎన్నికల హామీలను నిలుపుకుంటున్నామని వెల్లడి

సీఎం చంద్రబాబు అధ్యక్షతన కూటమి ప్రభుత్వ క్యాబినెట్ సమావేశం ముగిసింది. అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించి, క్యాబినెట్ భేటీ అంశాలను వివరించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ ఎన్నికల వేళ ఏం చెప్పారో... అవన్నీ ఇవాళ క్యాబినెట్ సమావేశంలో ఆమోదించామని చెప్పారు. 

అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ వేస్తామని చెప్పారని, అందుకు అనుగుణంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దురదృష్టం కొద్దీ... ప్రతి ఆరు నెలలకు ఓసారి జరగాల్సిన టెట్ ను గత ప్రభుత్వం నిర్వహించలేదని, వేలాది మంది నిరుద్యోగులు నష్టపోయే విధంగా వ్యవహరించిందని ఆరోపించారు. 

"80 శాతం డీఎస్సీ మార్కులు, 20 శాతం టెట్ మార్కులు కలిపి టీచర్ ఉద్యోగ నియామకాలకు అర్హతగా తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు టెట్ జరుపకపోవడం వల్ల నిరుద్యోగులు టెట్ మార్కులను మెరుగుపర్చుకునే అవకాశం కోల్పోయారు. 

ఇవాళ క్యాబినెట్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాణ్యమైన విద్యను అందించడం గురించి ప్రస్తావించారు. అందుకోసం జాతీయ విద్యా విధానాన్ని పరిశీలించి, రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంపొందించేలా ప్రతి ఒక్క విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలని ఆదేశించారు. 

క్యాబినెట్ భేటీలో చర్చకు వచ్చిన మరో ముఖ్యమైన అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ చట్టం రాకతో భూ యజమానులందరూ ఉలిక్కిపడ్డారు.... పిడుగు పడ్డట్టు భయపడిపోయారు. గత ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక ఉదాహరణ. 

భూ వివాదాలను తగ్గించాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ చట్టం తీసుకువచ్చింది. బీజేపీ తీసుకువచ్చిన చట్టాన్ని మేం అమలు చేశామని గత  ప్రభుత్వం చెప్పింది. అయితే... కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ ప్రతిపాదించిన ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి, మన రాష్ట్రం ఆమోదించిన చట్టానికి తీవ్ర వైరుధ్యాలు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... బీజేపీ పాలిత రాష్ట్రాలు ఒక్కటి కూడా ఈ చట్టాన్ని ఇంతవరకు అమలు చేయలేదు. 

కానీ వైసీపీ మాత్రం ఆదరాబాదరాగా ఈ చట్టాన్ని తీసుకువచ్చి సన్న, చిన్నకారు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. మొదట... పాస్ పుస్తకాలపై ఆయన ఫొటో ముద్రించడం, ఆ తర్వాత సర్వే రాళ్లపైనా అతడి ఫొటో, పేరు రాయడం చూసిన తర్వాత ఇవన్నీ కూడా ఏదైనా కుట్రలో భాగమా అని అనుమానాలకు దారితీసింది. 

ఈ చట్టంలో పేర్కొన్న టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ పాత్ర సందేహాలకు తావిచ్చే విధంగా ఉంది. పైగా దీంట్లో అప్పిల్లేట్ అథారిటీ ఎవరో చెప్పకపోవడంతో, వివాదాలు తలెత్తితే ఎవరిని ఆశ్రయించాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. నేరుగా హైకోర్టుకు వెళ్లాలని సూచించడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. 

ఇక, పెన్షన్ల పెంపు హామీకి అనుగుణంగా నేటి క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. కూటమి అధికారంలోకి వస్తే వివిధ రకాల పెన్షన్లు పెంచుతామని చెప్పాం. దాని ప్రకారమే 65.03 లక్షల మందికి లబ్ధి చేకూరేలా పెన్షన్ల పెంపునకు నేటి క్యాబినెట్ భేటీలో ఆమోదం లభించింది. గత ప్రభుత్వంలో రూ.1000 పెన్షన్ పెంచడానికి నాలుగేళ్లు పట్టింది. చంద్రబాబు ఇప్పుడు కేవలం రెండు వారాల్లో రూ.1000 పెంచేశారు. పెన్షన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై ప్రతి నెలా రూ.810 కోట్ల భారం పడుతుంది. 

జులై 1న సచివాలయ ఉద్యోగులే స్వయంగా ఇళ్లకు వెళ్లి మరీ లబ్ధిదారులకు పెంచిన పెన్షన్లు అందజేస్తారు. వాలంటీర్ల అంశం కూడా నేటి మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. వాలంటీర్ల సేవలను ఎలా వినియోగించుకోవాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుంది. 

ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టే... రాష్ట్రంలో స్కిల్ సెన్సస్ (నైపుణ్య ఆధారిత గణన) చేపడతాం. రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల పునరుద్ధరించాలని క్యాబినెట్ నిర్ణయించింది. మొదటగా 123 అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తారు. మిగిలిన క్యాంటీన్లను త్వరలోనే పునరుద్ధరిస్తారు. త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తాం. 

వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరిస్తున్నాం. దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం పేరు మార్చింది... కొన్ని సంవత్సరాల మార్కులు జాబితాలపై ఒక పేరు, మరికొన్ని సంవత్సరాల మార్కుల జాబితాలపై మరోపేరు ఉండడం వల్ల వైద్య విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. 

అటు, ఏజీగా శ్రీరామ్, అదనపు ఏజీగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి  రాజీనామా చేయడంతో ఆయా పదవులు ఖాళీ అయ్యాయి. ఏజీగా దమ్మాలపాటి శ్రీనివాస్ ను నియమించాలన్న నిర్ణయానికి క్యాబినెట్ ఆమోదం లభించింది. రాష్ట్రంలో గంజాయి వ్యాప్తిని అరికట్టడంపై మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేశాం. పంచాయతీలు, కార్పొరేషన్లలో పారిశుద్ధ్యం మెరుగుపర్చడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని క్యాబినెట్ నిర్ణయించింది. 

ఇక... అమరావతి రాజధాని, పోలవరం, విద్యుత్ శాఖ, శాంతిభద్రతలు, మద్యం, ల్యాండ్-శాండ్-మైనింగ్, ఆర్థిక పరిస్థితి అంశాలపై జూన్ 30 నుంచి జులై 18వ తేదీ వరకు శ్వేతపత్రాలు విడుదల చేస్తాం" అంటూ మంత్రి పార్థసారథి వివరించారు.

  • Loading...

More Telugu News