AP Cabinet: మెగా డీఎస్సీకి ఏపీ క్యాబినెట్ ఆమోదం.. కొనసాగుతున్న మీటింగ్

AP Cabinet Agree To Mega DSC

  • కేబినెట్ ముందుకు డీఎస్సీ నిర్వహణ షెడ్యూల్
  • జులై 1 నుంచి ప్రారంభం కానున్న నియామక ప్రక్రియ
  • డిసెంబర్ 10 లోపు 16 వేల ఉద్యోగాల భర్తీ
  • ఎన్నికల హామీల అమలుపై చర్చిస్తున్న మంత్రులు

మెగా డీఎస్సీకి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. సోమవారం ఉదయం సీఎం చంద్రబాబు నేతృత్వంలో కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై మంత్రులు చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా డీఎస్సీ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ను అధికారులు కేబినెట్ ముందుంచారు. దీనిపై సమగ్రంగా చర్చించిన కేబినెట్.. మెగా డీఎస్సీకి ఆమోదం తెలిపింది. ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం.. జులై 1 నుంచి ప్రారంభమయ్యే ప్రక్రియ డిసెంబర్ 10 నాటికి ముగియనుంది. మెగా డీఎస్సీ కింద 16,347 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 

దీంతో పాటు గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్‌ చట్టం రద్దు, ఎన్నికల సందర్భంగా పింఛను పెంపు హామీ, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ తదితర హామీల అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం. కొత్తగా టెట్‌ నిర్వహణ, టెట్‌ లేకుండా డీఎస్సీ నిర్వహణ ప్రతిపాదనలపైనా మంత్రులు చర్చించారు. ప్రస్తుతం రూ.3 వేలుగా ఉన్న పింఛన్ ను రూ.4 వేలకు పెంచేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. పెంచిన పింఛన్ ను జులై 1 నుంచి లబ్దిదారులకు ఇంటి వద్దే అందజేయాలని మంత్రులు నిర్ణయించారు. ఏప్రిల్ నెల నుంచే పింఛను పెంపు అమలు చేయాలని, ఆ మొత్తాన్ని ఈ నెల పింఛనుతో కలిపి ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీంతో ఈ నెలలో పింఛన్ దారులు రూ.7 వేల చొప్పున అందుకోనున్నారు.

  • Loading...

More Telugu News