Naveen-ul-Haq: ఆసీస్‌పై విజయం తర్వాత.. రెండేరెండు ఫొటోలతో తన ఆవేదన పంచుకున్న ఆఫ్ఘన్ బౌలర్

- టీ20 ప్రపంచకప్ సూపర్ 8 మ్యాచ్‌లో ఆసీస్‌పై 21 పరుగుల తేడాతో విజయం
- తమకు లభిస్తున్న మద్దతుపై ఆవేదనా భరిత పోస్ట్
- మద్దతుగా నిలుస్తున్న నెటిజన్లు
టీ20 ప్రపంచకప్ సూపర్-8లో ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధించిన తర్వాత ఆఫ్ఘనిస్థాన్ బౌలర్ నవీనుల్ హక్ ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. అద్భుతంగా ఆడుతున్నప్పటికీ మైదానంలో తమకు లభిస్తున్న మద్దతును రెండు ఫొటోల ద్వారా అందరికీ అర్థమయ్యేలా సింపుల్‌గా చెప్పేశాడు.
గ్యాలరీలో ఒకే ఒక్క అభిమాని మ్యాచ్‌ను తిలకిస్తున్న ఫొటో ఒకవైపు, అభిమానులతో గ్యాలరీ కిక్కిరిసిపోయిన ఫొటో మరోవైపు ఉంది. ఒక్కడే ఉన్న ఫొటోకు తమకు లభిస్తున్న మద్దతు అని, రెండో ఫొటోకు.. గెలిచాక వెల్లువెత్తుతున్న అభిందనలు అని పేర్కొన్నాడు.
దిగ్గజ జట్లను ఓడిస్తున్నప్పటికీ, ఇప్పటికే తాము నిరూపించుకున్నప్పటికీ మైదానంలో తమకు మద్దతు లభించడం లేదని, గెలిచాక మాత్రం ఇలా అభినందనలు చెప్పేందుకు ఎగబడుతుంటారని బాధతో చేసిన ఈ పోస్టు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కూడా అంతే ఆవేదనగా స్పందిస్తున్నారు. గెలిచాక అభినందించడానికి చాలామందే ముందుకు వస్తారని, ఆడేటప్పుడు మాత్రం ఎవరూ పట్టించుకోరంటూ అతడికి మద్దతుగా నిలుస్తున్నారు.
