Congress: బీజేపీ-ఇండియా కూటమి మధ్య ప్రొటెం స్పీకర్‌ రచ్చ.. సహకరించబోమన్న కాంగ్రెస్

Pro tem Speaker has emerged as a key flashpoint between the treasury and the Opposition benches
  • 7 సార్లు ఎంపీ భర్తృహరి మహతాబ్‌ను ఎంపిక చేయడంపై కాంగ్రెస్ అభ్యంతరం
  • ఎనిమిది సార్లు ఎంపీ కె.సురేశ్ ను ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్న
  • ఎంపీల ప్రమాణస్వీకారంలో ప్రొటెం స్పీకర్‌కు తమ సీనియర్ సభ్యులు సహకరింబోరన్న హస్తం పార్టీ

నూతనంగా ఏర్పాటైన 18వ లోక్‌సభ నేడు (సోమవారం) తొలిసారి భేటీ కానున్న నేపథ్యంలో బీజేపీ, ఇండియా కూటమి మధ్య ‘ప్రొటెం స్పీకర్ ఎంపిక’ వివాదం రాజుకుంది. నూతన చట్ట సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించేందుకు ప్రొటెం స్పీకర్‌ను ఎన్నుకుంటారు. ఇందుకుగానూ అత్యంత సీనియర్ ఎంపీని ఎంపిక చేస్తారు. ప్రక్రియలో భాగంగా ఏడుసార్లు ఎంపీ అయిన భర్తృహరి మహతాబ్‌ను బీజేపీ ప్రోటెం స్పీకర్‌గా ఎన్నుకుంది. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆయన గతంలో బిజూ జనతాదళ్‌ నేతగా ఉన్నారు. అయితే భర్తృహరి ఎంపికను విపక్ష కాంగ్రెస్ తప్పుబట్టింది.

ఎనిమిది సార్లు ఎంపీ అయిన కాంగ్రెస్ నేత కె.సురేశ్ ను ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించింది. అయితే భర్తృహరి మహతాబ్ వరుసగా ఏడు సార్లు లోక్‌సభ ఎంపీగా గెలిచారని, ఈ కారణంగానే ఆయనను ఎంపిక చేశామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, బీజేపీ సీనియర్ మంత్రి కిరెన్ రిజిజు సమాధానం ఇచ్చారు. ఇక సురేశ్ 1998, 2004 ఎన్నికలలో ఓడిపోయారని, ప్రస్తుత సభ ఆయనకు వరుసగా నాలుగవదని కిరెన్ రిజిజు పేర్కొన్నారు.

ప్రొటెం స్పీకర్‌కు సహకరించరు: కాంగ్రెస్
ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించడానికి ముందు భర్తృహరితో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆనవాయితీలో భాగంగా ప్రమాణం చేయిస్తారు. తద్వారా కొత్త స్పీకర్ ఎన్నిక వరకు ఆయన ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరిస్తారు. ప్రమాణస్వీకారం చేయించడంలో ప్రొటెం స్పీకర్‌కు సభలోని సీనియర్ సభ్యులైన కే.సురేశ్, టీఆర్ బాలు, రాధా మోహన్ సింగ్, ఫగ్గన్ సింగ్ కులస్థే, సుదీప్ బందోపాధ్యాయ సహకారం అందిస్తారని రాష్ట్రపతి ప్రకటించారు.

అయితే ప్రొటెం స్పీకర్ ఎంపికకు నిరసనగా ఇండియా కూటమి ఎంపీలైన సురేశ్, బాలు, బందోపాధ్యాయ ప్రమాణ స్వీకారంలో ప్రొటెం స్పీకర్‌కు సహకరించబోరని కాంగ్రెస్ స్పష్టం చేసింది. వరుసగా ఏడుసార్లు ఎంపీగా గెలిచిన రమేశ్ చందప్ప జిగజినాగిని ఎందుకు ప్రొటెం స్పీకర్ చేయలేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ప్రశ్నించారు. ఎనిమిది సార్లు ఎంపీ సురేశ్ కు ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదని, ఆయన దళితుడని ఎంపిక చేయలేదా? అని ‘ఎక్స్’ వేదికగా నిలదీశారు. 

కాంగ్రెస్ పార్టీ సురేశ్‌ను ప్రతిపక్ష నేతగా చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కౌంటర్ ఇచ్చారు. కాగా ఈసారి విపక్ష పార్టీల సభ్యుల సంఖ్య గణనీయంగా పెరగడం, నీట్‌లో అవకతవకలపై ఆరోపణల నేపథ్యంలో లోక్‌సభ సమావేశాలపై ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News