Mandimilli Ramprasad Reddy: ఆ నరకం ఎలా ఉంటుందో నాకు తెలుసు: ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Ram Prasad Reddy takes over as minister of AP Road transport sports youth departmnts
  • ఆదివారం ఏపీ రవాణా, క్రీడా, యువజన శాఖ బాధ్యతలు తీసుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి
  • రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు శాయశక్తులా కృషి చేస్తానని హామీ
  • తాను 11 ఏళ్లప్పుడు రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయానని వెల్లడి
  • ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటానన్న మంత్రి

ప్రమాదాల నివారణకు రవాణా శాఖ తరపున అన్ని చర్యలూ తీసుకుంటానని ఏపీ రవాణా, క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సచివాలయంలో తన శాఖల బాధ్యతలు తీసుకున్నారు. ‘రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యులెవరినైనా కోల్పోతే ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసు. మా నాన్న ఎమ్మెల్యేగా ఉండేవారు. నాకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదంలో ఆయన్ను కోల్పోయాను. రాష్ట్రాన్ని ప్రమాదరహితంగా మార్చేందుకు శాయశక్తులా కృషి చేస్తాను. ప్రమాదాల నివారణకు అన్ని చర్యలూ తీసుకుంటాను’’ అని అన్నారు. 

మంత్రిత్వ శాఖల బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘‘రోడ్లు బాగుంటే ప్రమాదాలు జరగవు. గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం ఏ రోడ్డుకూ పిడికెడు మట్టి వేయలేదు. ఒకటి, రెండు నెలల్లో రోడ్లు బాగుచేయడంపై దృష్టిపెడతాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని త్వరలో ఆరంభించి, వారి కళ్లల్లో ఆనందం చూడబోతున్నాం. అప్పుడు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది. ఇందుకు అనుగూణంగా బస్సుల సంఖ్య పెంపు, సిబ్బంది కొరత లేకుండా నియామకాలు చేపట్టడంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. జగన్ ప్రభుత్వం కొత్త బస్సులు ఏవీ కొనకుండా, తుక్కు అయిన బస్సులనే మరమ్మతులు చేయకుండా నడిపింది. 

‘అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆర్టీసీ స్థలాలను కాజేసిన వారి నుంచి వాటిని వెనక్కు తీసుకుంటాం. తక్కువ సొమ్ముతో బీఓటీ కింద విలువైన స్థలాలు తీసుకొని అక్కడ కార్యక్రమాలేవీ చేపట్టకపోతే వాటిని వెనక్కు తీసుకోనున్నాం. ప్రయాణికులు, ఆర్టీసీ కార్మికులను రెండు కళ్లలా చూసుకొని వారికి మేలు చేస్తాం. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసినా, కార్యకలాపాలు మాత్రం సంస్థ ద్వారానే జరుగుతున్నాయి. కార్పొరేషన్‌ను పూర్తిగా విలీనం చేస్తాం. మాజీ సీఎం జగన్ తన సోకుల కోసం బుల్లెట్ ప్రూఫ్ బస్సుల నుంచి రుషికొండ వరకూ భారీగా ఖర్చు చేశారు’’ అని మంత్రి విమర్శలు ఎక్కుపెట్టారు.

  • Loading...

More Telugu News