KR Suryanarayana: వైసీపీ పాలనలో తనకు ఎదురైన భయానక అనుభవాలను వెల్లడించిన ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ

Employees association leader KR Suryanarayana press meet
  • పోలీసులు తన భార్య మెడలోని నల్లపూసల దండ తీసేయించారని వెల్లడి
  • హైదరాబాద్ లోని తమ బంధువుల ఇళ్లకు వెళ్లి వాళ్లను కూడా వేధించారన్న సూర్యనారాయణ
  • సూర్యనారాయణ దొరికితే చంపేయాలని సజ్జల పోలీసులకు ఆదేశాలు ఇచ్చారని ఆరోపణ

గత వైసీపీ ప్రభుత్వంలో తనకు ఎదురైన భయానక అనుభవాలను ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల జేఏసీ చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ ఇవాళ మీడియా ముందుకు వచ్చి వివరించారు. 

ఏ కేసు పెట్టారో కూడా తెలియజేయకుండా విచారణ పేరిట తనను, తన కుటుంబాన్ని వేధించారని ఆరోపించారు. పోలీసులు తన భార్య మెడలోని నల్లపూసల గొలుసు తీసేయించి హేయంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తన ఇంటి చుట్టూ వందల సంఖ్యలో పోలీసులను మోహరించేవారని, హైదరాబాదులోని తమ చుట్టాల ఇంటికి వెళ్లి వాళ్లను కూడా బెంబేలెత్తించేవాళ్లని వివరించారు. 

రాత్రి సమయాల్లో కూడా పోలీసులు తన ఇంటి చుట్టూనే ఉండేవారని... తన కుటుంబాన్ని వేధించిన పోలీస్ ఆఫీసర్లు రావి సురేశ్ రెడ్డి, భాస్కరరావులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. 

అంతేకాకుండా, ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును కలిస్తే ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు అంటూ తనకు బెదిరింపులు వచ్చాయని సూర్యనారాయణ ఆరోపించారు. తన ఫోన్ ను కూడా ట్యాప్ చేశారని, పోలీసులు తన వాహన డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టారని వెల్లడించారు. 

సూర్యనారాయణ దొరికితే చంపేయాలని సజ్జల పోలీసులకు ఆదేశాలు జారీ చేశారని, "సూర్యనారాయణ దొరికాడా?" అంటూ  సజ్జల పోలీసులకు ఫోన్ చేయడం తన డ్రైవర్ విన్నాడని సూర్యనారాయణ స్పష్టం చేశారు. 

అందుకే, జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. తనలాగా గత ప్రభుత్వంలో ఇబ్బందులు  పడిన వారికి న్యాయం చేయాలని సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు. దీనిపై రేపు (జూన్ 24) జరిగే ఏపీ క్యాబినెట్ తొలి సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News