Insurance Payout: ఇన్సూరెన్స్ సొమ్ము కోసం మహిళ ‘చావు’తెలివి.. అస్సలు ఊహించని ట్విస్టులు

Australian gym owner was found to have faked her own death in to claim a insurance payout

  • చనిపోయినట్టు నటించి.. తనకు తానే భర్తగా అవతారం
  • ఆస్ట్రేలియాలో బయటపడిన భారీ కుట్ర
  • 5 లక్షల డాలర్ల ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఓ మహిళ ఊహించని నాటకం

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చనిపోయినట్టు నమ్మించిన ఉదంతాలు ఎన్నో వెలుగుచూశాయి. అయితే అంతకుమించి అనిపించేలా ఆస్ట్రేలియాలో ఒక నమ్మశక్యం కాని కేసు బయటపడింది. పెర్త్ నగరంలో జిమ్ నిర్వహిస్తున్న ఓ మహిళ 5 లక్షల డాలర్ల కోసం ‘చావు’తెలివి ప్రదర్శించింది. తాను కారు ప్రమాదంలో చనిపోయినట్టు అందరినీ నమ్మించింది. మరణ ధ్రువీకరణ పత్రాన్ని కూడా పుట్టించింది. అనంతరం ఆమె భర్త పేరిట విజయవంతంగా బీమాను క్లెయిమ్ చేసుకుంది. ఇన్సూరెన్స్ కంపెనీకి ఆమె అందజేసిన అకౌంట్‌లో 4,77,520 డాలర్ల భారీ మొత్తం జమ కూడా అయింది. అయితే అసలు సిసలైన ట్విస్ట్ ఇక్కడే బయటపడింది. చనిపోయినట్టుగా అందరినీ నమ్మించిన ఆమె.. ఏమాత్రం నమ్మశక్యం కాని రీతిలో మృతురాలి భర్తగా కొత్త అవతారం ఎత్తిందని బయటపడింది. 42 ఏళ్ల వయసున్న కరెన్ సాల్కిల్డ్ అనే మహిళ ఈ భారీ కుట్రకు పాల్పడింది.

కుట్ర బయటపడిందిలా..
భర్త పేరిట తీసుకున్న బ్యాంక్ ఖాతాలో ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బు జమ చేసింది. అయితే ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తంలో డబ్బు జమ కావడంపై సందేహించిన సదరు బ్యాంక్ అధికారులు ఖాతాను స్తంభింపజేశారు. దీంతో ఖాతాను పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా నిందితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో కథ అనూహ్య మలుపులు తిరిగింది. సాల్కిల్డ్ చనిపోయిందంటూ నకిలీ పత్రాలు సమర్పించింది. ఈ క్రమంలో ఆమె ఆడుతున్న నాటకాన్ని పోలీసులు పసిగట్టారు. అసలు గుట్టును లాగారు. మోసానికి పాల్పడిందని నిర్ధారణ అయింది. డెత్ సర్టిఫికేట్, మరణంపై దర్యాప్తు రికార్డులతో పాటు అనేక నకిలీ సర్టిఫికేట్‌లను ఆమె సృష్టించిందని తేలింది. ఈ మేరకు కోర్టులోనూ రుజువైంది. దీంతో జులై నెలలో కోర్టు ఆమెకు జైలు శిక్షను ఖరారు చేయనుంది. కాగా నిందితురాలిని మార్చి నెలలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. బీమా సొమ్ము కోసం విస్తృతమైన కుట్ర పన్నిందని, మరణ ధ్రువీకరణ పత్రం నకిలీదని పోలీసులు గుర్తించారు. 

కాగా నిందితురాలు సైకిల్డ్‌ గతంలో మాజీ అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశారని, ఎఫ్45 అనే జిమ్‌ను నిర్వహించారని, ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆస్ట్రేలియాలోనే వెలుగుచూసిన మరో కేసులో ఓ మహిళ తనకు రొమ్ము క్యాన్సర్ ఉందంటూ ‘గోఫండ్‌మీ’ ద్వారా 25 వేల డాలర్లు ఫండ్ సేకరించిందని తేలింది.

  • Loading...

More Telugu News