Ganta Srinivasa Rao: విశాఖ ఫిల్మ్ క్లబ్ లో ఉన్న గత ప్రభుత్వ పెద్దలు తమంతట తామే తప్పుకోవాలి: గంటా శ్రీనివాసరావు

Ganta Srinivasarao press meet in Vizag
  • విశాఖలో గంటా శ్రీనివాసరావు ప్రెస్ మీట్
  • వైజాగ్ సినిమా రంగానికి ఒక సెంటిమెంట్ ప్రాంతం అని గంటా వెల్లడి
  • స్టార్ డైరెక్టర్లు కనీసం ఒక్క సీన్ అయినా విశాఖలో తీసేవారని వివరణ

భీమిలి టీడీపీ శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు నేడు మీడియా సమావేశం నిర్వహించారు. విశాఖలోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైజాగ్ నగరం సినిమా పరంగా ఒక సెంటిమెంట్ ప్రాంతం అని వెల్లడించారు. పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా తమ సినిమాల్లో కనీసం ఒక్క సీన్ అయినా ఇక్కడ తీసేవారని తెలిపారు. 

హైదరాబాద్ లో ఉన్న ఫిల్మ్ క్లబ్ తరహాలో, ఏపీలోనూ ఫిల్మ్ క్లబ్ ఏర్పాటు చేయాలనుకుని... గతంలో తొట్లకొండపై సుమారు 15 ఎకరాల భూమి కేటాయించినట్టు గంటా వెల్లడించారు. ఫిల్మ్ క్లబ్ నిర్మాణానికి సర్వం సిద్ధమైన తరుణంలో... అక్కడ ఫిల్మ్ క్లబ్ ఏర్పాటు చేస్తే ఇబ్బందులు వస్తాయని మీడియాలో కథనాలు వచ్చాయని తెలిపారు. 

దాంతో, తొట్లకొండలో కాకుండా, రామానాయుడు స్టూడియోలో ఫిల్మ్ క్లబ్ కోసం 5 ఎకరాలు కేటాయించామని గంటా శ్రీనివాసరావు వివరించారు. ప్రస్తుతం ఫిల్మ్ క్లబ్ లో 1,630 మంది సభ్యులు ఉన్నారని వెల్లడించారు. 

అయితే, 2019లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంలో కొందరు పెద్దలు వింత ధోరణితో వ్యవహరించారని ఆరోపించారు. "ఆ పెద్దలు విశాఖపై పెత్తనం చలాయించడం మొదలుపెట్టారు. ఇక్కడి వ్యాపారాలను హస్తగతం చేసుకోవడం ప్రారంభించారు. ఆ పెద్దలు రాడిసన్ హోటల్ లో 15 శాతం, బే పార్క్ లో వాటాలు కాజేశారు. చివరికి వాళ్ల కన్ను ఈ ఫిల్మ్ క్లబ్ పై కూడా పడింది. ఆ విధంగా గత ప్రభుత్వ హయాంలో... ఏ మాత్రం సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తుల చేతుల్లోకి క్లబ్ వెళ్ళిపోయింది. ఆ ప్రభుత్వ పెద్దలు ఈ క్లబ్ కు వైఎస్ఆర్ పేరు పెట్టేశారు. 

ఇక, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లోనూ అంతే. ఈ క్రికెట్ సంఘంలో స్పోర్ట్స్ కి సంబంధించిన వ్యక్తులు ఎవరూ లేరు. ఇప్పుడు చెబుతున్నాం... ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో కానీ, ఈ ఫిల్మ్ క్లబ్ లో కానీ... ఇంకా ఎందులో అయినా సరే గత ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో... వారు తమంతట తామే తప్పుకోవాలి" అని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. 

ఈ మీడియా సమావేశంలో గంటా శ్రీనివాసరావుతో పాటు సీనియర్ నిర్మాతలు కేఎస్ రామారావు, అశోక్ కుమార్ కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News