Sunita Williams: అంతరిక్షం నుంచి సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణం మరింత ఆలస్యం!
- 10 రోజుల మిషన్‌లో భాగంగా రోదసీ యాత్ర చేపట్టిన సునీతా, విల్‌మోర్
- జూన్ 5న అంతరిక్షంలోకి చేరుకున్న బోయింగ్ స్టార్‌లైనర్
- సాంకేతిక కారణాలతో భూమిపై ల్యాండింగ్ వాయిదా
భారత సంతతి అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్‌మోర్‌లు ప్రయాణించిన బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌక తిరుగు ప్రయాణంలో సమస్యలు తలెత్తాయి. దీంతో ఈ వ్యోమనౌక ల్యాండింగ్ వాయిదాపడింది. ఈ వ్యోమనౌక సాంకేతిక సమస్యల కారణంగా పలుమార్లు వాయిదాపడి... ఎట్టకేలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగు పెట్టింది. ఈ బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌక జూన్ 5న అంతరిక్షంలోకి చేరుకుంది.
10 రోజుల మిషన్‌లో భాగంగా సునీతా, విల్‌మోర్ ఈ రోదసీ యాత్రను చేపట్టారు. జూన్ 14న వీరిద్దరు భూమి వైపు తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. కానీ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో భూమిపై ల్యాండింగ్‌ను వాయిదా వేశారు. జూన్ 26న వీరు తిరుగు ప్రయాణం కానున్నట్లు నాసా ఆ తర్వాత ప్రకటించింది. కానీ మరోసారి ఇది వాయిదాపడింది. కొత్త తేదీని వెల్లడించాల్సి ఉంది. అన్నీ అనుకూలిస్తే జులై 2న వీరి రిటర్న్ జర్నీ ఉండవచ్చునని నాసా అంచనా వేస్తోంది.