Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించిన ప్రధాన పూజారి కన్నుమూత

Acharya Laxmikant Dixit the chief priest who had performed the consecration of the Ram temple in Ayodhya died
  • 86 ఏళ్ల వయసులో ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ తుది శ్వాస
  • శనివారం ఉదయం కన్నుమూత
  • వారణాసిలో సీనియర్ పూజారిగా గుర్తింపు తెచ్చుకున్న లక్షీకాంత్ దీక్షిత్

ఈ ఏడాది జనవరి22న అయోధ్యలో రామమందిరానికి అంగరంగ వైభవంగా ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రధాన అర్చకుడు ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ తుదిశ్వాస విడిచారు. శనివారం ఉదయం ఆయన కన్నుమూశారు. 86 ఏళ్ల వయసున్న ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు ప్రకటించారు. వారణాసిలోని మణికర్ణిక ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

వారణాసిలో సీనియర్ పండితులలో ఒకరిగా పేరు పొందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ స్వస్థలం మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా. ఆయన కుటుంబ సభ్యులు కొన్ని తరాలుగా వారణాసిలో నివసిస్తున్నారు. దీంతో లక్ష్మీకాంత్ కూడా వారణాసిలోనే స్థిరపడ్డారు.

దీక్షిత్ మృతి పట్ల ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. కాశీ మహా పండితుడు, శ్రీరామ జన్మభూమి ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించిన ప్రధాన అర్చకుడు లక్ష్మీకాంత దీక్షిత్ నిష్క్రమణ ఆధ్యాత్మిక, సాహిత్య ప్రపంచానికి తీరని లోటు అని వ్యాఖ్యానించారు. సంస్కృత భాష, భారతీయ సంస్కృతికి ఆయన చేసిన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయని అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన శిష్యులు, అనుచరులకు ఈ దుఃఖాన్ని భరించే శక్తిని ఇవ్వాలని శ్రీరాముడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.

  • Loading...

More Telugu News