Vangalapudi Anitha: చంద్రబాబు కంట కన్నీరు చూసిందీ సభ: ఏపీ హోం మంత్రి అనిత

Home Minister Anitha speech In AP Assembly
  • కౌరవ సభను గౌరవ సభగా మార్చి చంద్రబాబు తమను ఇక్కడికి తీసుకొచ్చారన్న మంత్రి 
  • అయ్యన్న పాత్రుడు సభాపతిగా ఎన్నికవడం ఉత్తరాంధ్రవాసిగా తన అదృష్టమని హర్షం 
  • ఉత్తరాంధ్ర టైగర్.. తాతాజీ అని ప్రజలు ప్రేమగా పిలుచుకునే నేత అంటూ కితాబు 
  • నాడు టీచర్ గా ఎమ్మెల్యే అయ్యన్నను కలిశానని గుర్తుచేసుకున్న అనిత 

ఉత్తరాంధ్ర టైగర్ అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా ఎన్నికవడం ఉత్తరాంధ్ర ప్రజలకు దక్కిన గౌరవం, ఉత్తరాంధ్రకు చెందిన తన అదృష్టమని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. సభాపతిగా ఎన్నికైన అయ్యన్న పాత్రుడుకు అభినందనలు తెలియజేస్తూ సభలో మంత్రి ప్రసంగించారు. ఉత్తరాంధ్ర ప్రజలు అయ్యన్న పాత్రుడును తాతాజీ అంటూ ప్రేమగా పిలుచుకుంటారని చెప్పారు. తన పక్క నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తూ, తనకు మార్గదర్శకంగా ఉంటూ వస్తున్నారని వివరించారు.

2004లో ఎమ్మెల్యేగా ఉన్న అయ్యన్న పాత్రుడును ప్రభుత్వ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న తాను వెళ్లి కలిశానని, బొకే ఇచ్చి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశానని గుర్తుచేసుకున్నారు. ఈ రోజు నాటి ఎమ్మెల్యే నేడు సభాపతి స్థానంలో కూర్చోగా.. అప్పటి టీచర్ అయిన తాను ఓ మంత్రిగా, శాసన సభ్యురాలిగా అయ్యన్న పాత్రుడు గొప్పతనాన్ని సభకు వివరించే గొప్ప అవకాశం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.

అయ్యన్న పాత్రుడు నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో చిన్న మచ్చ కూడా లేకుండా ఉండడం నిజంగా గొప్ప విషయమని, ఇందులో ఆయన కుటుంబ సభ్యుల పాత్రను విస్మరించరాదని చెప్పారు. చివరకు ఆయన మూడేళ్ల మనవరాలిని కూడా పోలీసులు ఇంటరాగేట్ చేశారని మంత్రి అనిత గుర్తుచేశారు. అయ్యన్న పాత్రుడు తనను ఓ కూతురులా, తన కుటుంబ సభ్యురాలిగా చూసుకుంటారని సభకు తెలియజేశారు. 

అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన ఏపీ శాసన సభకు పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో సభలో జరిగిన అన్యాయాలు రాబోయే ఐదేళ్లలో పునరావృతం కాకుండా చూసుకునే శక్తి అయ్యన్న పాత్రుడుకు ఉందని చెప్పారు. ముఖ్యంగా ఈ సభలో గడిచిన ఐదేళ్లలో జరిగిన అన్యాయాలు, ఆడబిడ్డలకు జరిగిన అవమానాలు సభ్యురాలిగా తనకు ఎంతో ఆవేదనను కలిగించాయని, కన్నీరు పెట్టించాయని పేర్కొన్నారు.

నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న, సీనియర్ నాయకుడు గౌరవ చంద్రబాబు కన్నీరును ఈ సభ చూసిందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఆనాడు సభలో కన్నీటి మధ్య చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రజలు మరిచిపోలేదని చెప్పారు. ‘ఈ కౌరవ సభ నుంచి నేడు వెళుతున్నా.. మళ్లీ గౌరవ సభలోనే అడుగుపెడతా’ అంటూ చంద్రబాబు చేసిన ఛాలెంజ్ ను మంత్రి అనిత గుర్తుచేశారు. అన్నట్లుగానే కౌరవ సభను గౌరవ సభగా మార్చిన చంద్రబాబు.. తనతో పాటు మనందరినీ ఇక్కడికి తీసుకొచ్చారని చెప్పారు.

  • Loading...

More Telugu News