Satya kumar Yadav: ఉత్తరాంధ్ర ఉద్యమానికి అయ్యన్న ఊపిరిగా నిలిచారు: సత్యకుమార్ యాదవ్

AP Minister Satya kumar Yadav Speech in Assembly
  • సభాపతి ఎంపికకు నామినేట్ చేసే అవకాశం దక్కడం తన అదృష్టమని వ్యాఖ్య
  • సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ప్రతికూలతలను ఎదుర్కొన్నారని కామెంట్
  • ప్రజల వాణిని తనదైన బాణిలో వినిపించారంటూ అయ్యన్న పాత్రుడికి శుభాకాంక్షలు తెలిపిన సత్యకుమార్

సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఉత్తరాంధ్ర ప్రజల ఉద్యమ ఆకాంక్షలకు ఊపిరిగా నిలిచిన పెద్దలు చింతకాయల అయ్యన్న పాత్రుడు నేడు స్పీకర్ పదవిని అలంకరించడం సంతోషంగా ఉందంటూ ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. తొలిసారి సభకు ఎన్నికైన తనలాంటి వారికి అయ్యన్న పాత్రుడు మార్గదర్శకత్వం చేయాలని కోరారు. సభాపతిగా ఆయన పేరును నామినేట్ చేసే అవకాశం కలగడం తన అదృష్టమని చెప్పారు. మొదటిసారి సభలో అడుగుపెట్టిన తనకు ప్రసంగించే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చెప్పారు. అయ్యన్న పాత్రుడు తన రాజకీయ జీవితంలో ప్రజల పక్షాన నిలబడి ఎన్నో అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నించి అడ్డుకున్నారని కొనియాడారు.

మరీ ముఖ్యంగా గత ఐదేళ్ల అరాచక పాలనలో అయ్యన్న పాత్రుడు ఎన్నో ఇబ్బందులను, అరాచకాలను ఎదుర్కొంటూ ప్రజల పక్షాన పోరాడారని గుర్తుచేశారు. ప్రజల గొంతుకై ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలను ఎలుగెత్తి చాటిన అయ్యన్న పాత్రుడుకు సభాముఖంగా రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానంటూ సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ప్రజల వాణిని తనదైన బాణిలో వినిపించారని, రాజ్యాంగబద్ధ పదవి కారణంగా అటువంటి వాడివేడిని ఇక చూడలేకపోవడం కొంత లోటుగానే భావిస్తున్నట్లు చెప్పారు. అల్లరి చేసే క్లాస్ టీచర్ గా కాకుండా అల్లరిని నియంత్రించే ప్రిన్సిపాల్ గా అయ్యన్న పాత్రుడు ఉండాలని కోరకుంటున్నట్లు చెప్పారు.

అభివృద్ధికి చిరునామాగా ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వ పాలనలో అవినీతికి చిరునామాగా మారిందని సత్యకుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టడానికి, ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారని చెప్పారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వారు అభివృద్ధి బాటలో నడిపిస్తారనే నమ్మకం తనకుందని సత్యకుమార్ యాదవ్ చెప్పారు. రాష్ట్ర ప్రగతికి తీసుకొచ్చే బిల్లులపై సభలో ఆరోగ్యకరమైన చర్చ జరుగుతుందని, దీనికి అయ్యన్న పాత్రుడుకు ఉన్న రాజకీయ అనుభవం ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నట్లు చెబుతూ సత్యకుమార్ యాదవ్ తన ప్రసంగాన్ని ముగించారు.

  • Loading...

More Telugu News