Pawan Kalyan: తిట్టే వాళ్లను కట్టడి చేసే బాధ్యత మీపై ఉంది: పవన్ కల్యాణ్

Pawan Kalyan First Speech In Assembly

  • స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఎన్నికపై హర్షం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం
  • తిట్టే అవకాశం కోల్పోయారంటూ సభ్యులను నవ్వించిన పవన్
  • భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన పనిలేదని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 16 వ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన అయ్యన్న పాత్రుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. తొలిసారిగా సభలో అడుగుపెట్టిన తనలాంటి వారికి అధ్యక్ష స్థానంలో కూర్చున్న అయ్యన్న పాత్రుడు రాజకీయ అనుభవం మార్గదర్శకంగా పనిచేస్తుందని చెప్పారు. ఇన్నాళ్లూ అయ్యన్న వాడి వేడి చూసిన ప్రజలు ఇకపై ఆయన హుందాతనం చూస్తారని పేర్కొన్నారు. అయితే, ప్రత్యర్థులను తిట్టే అవకాశం గౌరవ స్పీకర్ పదవి కారణంగా అయ్యన్న కోల్పోవడం కాస్త బాధగా ఉందంటూ పవన్ అన్నారు. దీంతో సభలో నవ్వులు వెల్లివిరిశాయి. సభికులు కొందరు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు.

సభలో ప్రత్యర్థులను తిట్టే అవకాశం కోల్పోయిన అయ్యన్న పాత్రుడు.. తిట్టే సభ్యులను నియంత్రించాల్సిన బాధ్యత చేపట్టడం సంతోషంగా ఉందని పవన్ చెప్పారు. స్కూలులో అల్లరి పిల్లవాడిని క్లాస్ లీడర్ గా చేసినట్లుగా ఉందని అన్నారు. అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన సభ హుందాగా నడుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ, చర్చల పేరుతో అసభ్య పదజాలం వినిపించకుండా చూడాలని కోరారు. గతంలో సభలో జరిగిన తిట్ల పురాణం వల్ల ప్రజలు విసిగిపోయి, వారిని కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేశారని పరోక్షంగా వైసీపీ ఓటమిని పవన్ గుర్తుచేశారు. విజయాన్ని ఆహ్వానించడం మాత్రమే వారికి తెలుసని, ఓటమిని ఒప్పుకోలేక సభ నుంచి పారిపోయారని విమర్శించారు.

భాష నియంత్రణ సభ నుంచే మొదలుకావాలని, గౌరవ స్పీకర్ ఆ బాధ్యత తీసుకోవాలని పవన్ కల్యాణ్ కోరారు. సభలో చిన్నా పెద్ద నాయకుడనే తేడా లేకుండా వ్యక్తిగత దూషణ గత సభలలో చూసి ప్రజలతో పాటు తనకూ బాధేసిందని చెప్పారు. భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన పనిలేదని అన్నారు. భాష మనుషులను కలిపేందుకే కానీ విడగొట్టడానికి కాదని, విద్వేషాలు రేపడానికి అంతకంటే కాదని పవన్ అన్నారు. విద్వేషాలను పరిష్కరించడానికి ఉపయోగపడాలని, ఈ సభ ఉన్నదే అందుకని గుర్తుచేశారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు ఈ సభ భవిష్యత్ కు ప్రమాణంగా మారాలని పవన్ కోరారు. సభలో ఇప్పుడున్న వారంతా శాసనాలు రూపొందించడానికే తప్ప ఉల్లంఘించడానికి కాదన్నారు. విభేదించడం, వాదించడం ఇవన్నీ ప్రజాస్వామ్యానికి పునాదులు అని చెప్పారు.

పొట్టి శ్రీరాములు ప్రస్తావన..
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు మన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతోనే మొదలైందని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు బలిదానంతో మన రాష్ట్రం పుట్టిందన్నారు. 56 రోజుల పాటు తిండినీరు మానేసి ఆయన నరకం అనుభవించారు. ఆయన త్యాగాన్ని గుర్తుంచుకుంటూ సభను ప్రతీ నిమిషం రాష్ట్ర పురోభివృద్ధికి ఉపయోగపడేలా సభా సమయాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ‘అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతిలో విలువలతో కూడిన సత్సంప్రదాయాలకు తెరలేపుతూ మీ ఆధ్వర్యంలో ఈ సభను నడుపుతూ, ఈ విలువైన ఐదేళ్లు రాబోయే తరాలకు గొప్ప భవిష్యత్తును ఇచ్చేలా, రైతులకు అండగా, మహిళలకు భద్రత కల్పించేలా, ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత ఇచ్చేలా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేసేలా చర్చలు జరగాలని కోరుకుంటున్నా. సభాపతి అయ్యన్న పాత్రుడు గారికి మరోమారు శుభాభినందనలు తెలియజేస్తున్నా’ అంటూ పవన్ తన ప్రసంగాన్ని ముగించారు.

  • Loading...

More Telugu News