AP Speaker: సభాపతి సీటు వద్దకు అయ్యన్న పాత్రుడిని తోడ్కొని వెళ్లిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

Ayyanna patrudu Elected As Andrapradesh Speaker

  • అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన ప్రొటెం స్పీకర్
  • స్పీకర్ గా బాధ్యతలు స్పీకరించిన అయ్యన్న పాత్రుడు
  • చంద్రబాబు, పవన్ తో పాటు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన స్పీకర్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభాపతి పదవికి అయ్యన్న పాత్రుడు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవంగా మారింది. అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో ప్రకటించారు. ఆయనను గౌరవంగా సభాపతి సీటు వద్దకు తోడ్కొని రావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లకు సూచించారు. 

సభ్యుల అభినందనల మధ్య అయ్యన్న పాత్రుడు స్పీకర్ బాధ్యతలు స్వీకరించారు. అయ్యన్న పాత్రుడిని చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు స్పీకర్ సీటులో కూర్చుండబెట్టారు. కాగా, సభాపతిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులకు అయ్యన్న పాత్రుడు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, స్పీకర్ పదవికి తనను ప్రతిపాదించిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా అనుభవం..
అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి గెలిచిన అయ్యన్న పాత్రుడుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. దాదాపు నలభై ఏళ్లుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ప్రజలకు సేవ చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అయ్యన్న.. నాటి నుంచి పార్టీతోనే ప్రయాణించారు. నర్సీపట్నం నుంచి పదిసార్లు పోటీ చేయగా.. ఏడుసార్లు గెలిచారు. సాంకేతిక విద్య-క్రీడలు, రహదారులు-భవనాలు, అటవీ, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రిగా అయ్యన్న పాత్రుడు గతంలో పనిచేశారు.

  • Loading...

More Telugu News