Govt Office: 9:15 లోగా ఆఫీసులో ఉండాల్సిందే.. కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వ ఆదేశాలు

Central Government Cracks Whip On Latecomers

  • లేదంటే ఆఫ్ డే లీవ్ కింద పరిగణిస్తామని పర్సనల్ డిపార్ట్ మెంట్ హెచ్చరిక
  • ఉద్యోగులందరూ బయోమెట్రిక్ తోనే హాజరు వేయాలని సూచన
  • విధులకు ఆలస్యంగా వచ్చేవారికి చెక్ పెట్టేందుకు నిర్ణయం

ప్రభుత్వ ఉద్యోగులంటే సమయానికి ఆఫీసుకు రారని, ఇష్టం వచ్చినప్పుడు తాపీగా వస్తారని చాలామంది అభిప్రాయపడుతుంటారు. చాలాచోట్ల అలాగే జరుగుతుంటుంది. అయితే, ఇకపై ఇష్టమొచ్చినపుడు ఆఫీసుకు వస్తానంటే కుదరదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉదయం 9:15 లోగా బయోమెట్రిక్ లో హాజరు పడకపోతే ఆ పూటకు లీవ్ పెట్టుకోవాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈమేరకు డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.

కరోనా టైమ్ లో వైరస్ భయంతో బయోమెట్రిక్ హాజరుకు స్వస్తి పలికిన ఉద్యోగులు.. చాలాచోట్ల ఇప్పటికీ దానిని ఉపయోగించడంలేదని సమాచారం. హాజరు కోసం గతంలోలాగే రిజిస్టర్ నిర్వహిస్తున్నారని, దీంతో ఎంత లేట్ గా వచ్చినా ఇన్ టైంలోనే వచ్చినట్లు అందులో నమోదు చేసుకునే అవకాశం ఉంటోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది. బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ.. ఏదైనా కారణం వల్ల ఆలస్యం జరిగే అవకాశం ఉందనుకుంటే ముందుగానే తనపై అధికారికి సమాచారం ఇచ్చి, ఆ పూటకు క్యాజువల్ లీవ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అదేవిధంగా సాయంత్రం 5:30 తర్వాతే ఔట్ పంచ్ పడాలని స్పష్టం చేసింది.

ఉద్యోగులు ఏమంటున్నారంటే..
ఆఫీసు పనిగంటల తర్వాత కూడా తాము పనిచేయాల్సి వస్తోందని, కొన్నిసార్లు సెలవు రోజులలో కూడా ఆఫీసుకు రావాల్సిన అవసరం ఏర్పడుతోందని ఉద్యోగులు చెబుతున్నారు. కొన్నిసార్లు ఉదయం ఆలస్యంగా వచ్చినా సాయంత్రం పూట చాలా పొద్దుపోయేదాక పనిచేస్తున్నామని వివరించారు. నియమిత పనిగంటలకు మించి తాము పనిచేస్తున్నామని, ఒక్కోసారి ఇంటి వద్ద నుంచి కూడా పనిచేస్తున్నామని చెబుతున్నారు. ఇవన్నీ గుర్తించకుండా పావుగంట ఆలస్యమైతే ఆ పూటకు లీవ్ కింద పరిగణిస్తామనే రూల్ సరికాదని అంటున్నారు.

Govt Office
latecomers
Biometic
Attendence
Halfday leave
  • Loading...

More Telugu News