Revanth Reddy: బొగ్గుగనుల వేలంపై.. ఎక్స్ వేదికగా సీఎం వర్సెస్ కేటీఆర్

Revanth Reddy versus KTR on X
  • బొగ్గు గనుల వేలంపై 2021 నాటి రేవంత్ రెడ్డి ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ కేటీఆర్ ప్రశ్న
  • నాడు వేలాన్ని వ్యతిరేకించి ఈరోజు ఎందుకు పాల్గొన్నారని ప్రశ్న
  • బొగ్గు గురించే కాదు... ప్రజల హక్కుల గురించి కూడా పోరాడుతామని రేవంత్ రెడ్డి కౌంటర్

బొగ్గు గనుల వేలంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య ఎక్స్ వేదికగా ట్వీట్ల యుద్ధం సాగింది. 'రేవంత్ గారూ' అని కేటీఆర్ ట్వీట్ చేసి ప్రశ్నిస్తే... 'కేటీఆర్ గారూ' అంటూ రేవంత్ రెడ్డి ప్రతిస్పందించారు.

పీసీసీ అధ్యక్షుడిగా 2021లో మీరు బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని, 4 బ్లాక్‌లను సింగరేణికి బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం గుర్తుంచుకోవాలంటూ నాడు రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ గుర్తు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని... కానీ అప్పుడు వేలాన్ని వ్యతిరేకించి, ఇప్పుడు వేలం పాట కోసం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కను పంపించడం ఏమిటని విమర్శించారు. మీలో మార్పుకు గల కారణాలు చెప్పాలని నిలదీశారు. 

బొగ్గు క్షేత్రాలను వేలం వేయడం ద్వారా సింగరేణిని ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మీరు గతంలో చెప్పారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం గతంలో గుజరాత్, ఒడిశాలలో ప్రభుత్వరంగ సంస్థలకు గనులను నేరుగా కేటాయించిందని, ఇప్పుడు సింగరేణికి కేటాయించాలని మీరు ఎందుకు అడగడం లేదని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.

స్పందించిన రేవంత్ రెడ్డి

కేటీఆర్ ట్వీట్‌ను రేవంత్ రెడ్డి రీట్వీట్ చేస్తూ సమాధానం ఇచ్చారు. పదేళ్లుగా మీరు తెలంగాణ ఏం చెబుతుందో పట్టించుకోలేదని... ఇప్పుడు కూడా మీది అదే ధోరణి అని కేటీఆర్‌ను ఉద్దేశించి విమర్శించారు. తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు, కేడర్ అంతా కేంద్ర ప్రభుత్వ, గత కేసీఆర్ ప్రభుత్వ ప్రైవేటీకరణను వ్యతిరేకించారని పేర్కొన్నారు. సింగరేణి మొదటి, రెండో బ్లాక్‌లను కేంద్రం విక్రయించినప్పుడు కేసీఆర్ సీఎంగా ఉన్నారని... నాడు అరబిందో, అవంతిక కంపెనీలకు విక్రయించారన్నారు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రైవేటీకరణను వ్యతిరేకించలేదని విమర్శించారు.

మా ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సింగరేణి బ్లాక్‌ల ప్రైవేటీకరణను, వేలాన్ని వ్యతిరేకిస్తున్నారని... అదే సమయంలో అవంతిక, అరబిందోలకు విక్రయించిన బొగ్గు బ్లాక్‌లను రద్దు చేసి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు. తెలంగాణ ప్రజలు, వారి ప్రయోజనాలు, ఆస్తులు, హక్కులు, భవిష్యత్తు... కాంగ్రెస్‌తోనే సురక్షితమన్నారు. మన బొగ్గు గురించి మాత్రమే కాదు... ప్రజల ప్రతి హక్కు గురించి పోరాడుతామన్నారు.

  • Loading...

More Telugu News