Chandrababu: బాపట్ల జిల్లాలో హత్యాచార ఘటన... వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని హోంమంత్రిని ఆదేశించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu gets furious on woman murder in Bapatla district

  • ఈపూరుపాలెం వద్ద రైలు పట్టాల పక్కన యువతి మృతదేహం
  • అత్యాచారం చేసి చంపి ఉంటారని అనుమానం  
  • సీఎం ఆదేశాలతో ఘటన స్థలానికి వెళ్లిన హోంమంత్రి అనిత
  • సీఎం చంద్రబాబుకు ఘటన వివరాలు తెలిపిన డీజీపీ

బాపట్ల జిల్లా ఈపూరుపాలెం వద్ద ఓ యువతి (21)పై అత్యాచారం చేసి హత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. రైలు పట్టాల పక్కనే యువతి మృతదేహం పడి ఉంది. ఆమెను స్థానిక సీతారాంపేటకు చెందిన యువతిగా గుర్తించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఘటన స్థలానికి వెళ్లి, బాధిత కుటుంబాన్ని కలవాలని హోంమంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు. 

మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా ఉండాలని చంద్రబాబు నిర్దేశించారు. వేగంగా దర్యాప్తు చేసి, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని స్పష్టం చేశారు. దర్యాప్తులో అలసత్వం లేకుండా, జాప్యం జరగకుండా చూడాలని పేర్కొన్నారు. 

కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో రాష్ట్ర హోంమంత్రి అనిత బాపట్ల జిల్లా ఈపూరుపాలెం వెళ్లి, సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తప్పకుండా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. 

ఇదే అంశంపై సచివాలయంలో సీఎం చంద్రబాబుతో డీజీపీ ద్వారకా తిరుమలరావు భేటీ అయ్యారు. బాపట్ల జిల్లాలో యువతి హత్యకు గురైన ఘటనను సీఎంకు వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎం చంద్రబాబు డీజీపీకి చెప్పారు. త్వరలో పోలీసు యంత్రాంగం ప్రక్షాళన ఉంటుందని డీజీపీకి స్పష్టం చేశారు. 

ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్య అంశమని పేర్కొన్నారు. ఈపూరుపాలెం ఘటనలో దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలని సీఎం చంద్రబాబు డీజీపీని ఆదేశించారు.

  • Loading...

More Telugu News