Mudragada Padmanabha Reddy: నా పేరు మార్పు వెనుక ఎవరి ఒత్తిడి లేదు: ముద్రగడ పద్మనాభరెడ్డి

Mudragada talks about his name change

  • పిఠాపురంలో పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటానన్న ముద్రగడ పద్మనాభం
  • పవన్ గెలవడంతో నిజంగానే పేరు మార్చుకున్న ముద్రగడ
  • తనంతట తానే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి పేరు మార్పించుకున్నానని వెల్లడి

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న ముద్రగడ పద్మనాభం అన్నంత పనీ చేశారు. పేరు మార్పు కోసం ప్రభుత్వపరమైన అన్ని ప్రక్రియలు పూర్తి చేసి గెజిట్ నోటిఫికేషన్ ను కూడా తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో, ఆయన ఓ వీడియో సందేశం వెలువరించారు. తన పేరు మార్పు వెనుక ఎవరి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. 

"పేరు మార్పు కోసం దరఖాస్తు చేశాను. ప్రభుత్వం ఆమోదించింది. ఆ మేరకు గెజిట్ లోనూ ముద్రించింది. అంతే తప్ప ఎవరి ఒత్తిడి లేదు. నా ఒత్తిడి వల్లే, నా అభ్యర్థనతోనే ప్రభుత్వం ఇంత త్వరగా పేరు మార్పు ప్రక్రియ పూర్తి చేసింది. 

గతంలో మా అబ్బాయి చల్లారావు అనే పేరును గిరి అని మార్చుకున్నాడు. అందుకు మూడు నెలలు పట్టింది. దాంతో, నా పేరు మార్పు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరాను. అధికారులు స్పందించి నా పని చేసిపెట్టారు. ఇది నా అంతట నేను చేయించుకున్నాను... ఇందులో ఎవరి ఒత్తిడి లేదు. 

ఎమ్మార్వో, ఎస్సై నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకుని అమరావతి ప్రభుత్వ ముద్రణా కార్యాలయానికి అందజేశాను. అక్కడి అధికారుల నుంచి రెండు సార్లు సూచనలు వచ్చిన మీదట ఆ పత్రాలు మరోసారి పంపించాను. ఆ విధంగా పేరు మార్చుకున్నాను" అని వివరించారు. 

ఇక కాపు రిజర్వేషన్ల అంశంపైనా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ముద్రగడ పద్మనాభరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "చేతకానివాడ్ని, అసమర్థుడ్ని, అమ్ముడుపోయాను కాబట్టి ఆ రోజు ఉద్యమాన్ని కొనసాగించలేకపోయాను పవన్ కల్యాణ్ గారు. కాపుల కోరిక నెరవేర్చలేకపోయాను. 

ఇప్పుడు మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉన్నాయి. కాపుల చిరకాల కోరిక తీర్చే అవకాశం, ఆ దమ్ము ధైర్యం మీకు ఉందని అనుకుంటున్నాను. మీరు తలుచుకుంటే కొన్ని రోజుల్లోనే కాపులకు రిజర్వేషన్లు ఇప్పించగలరు... ఆ సత్తా మీకుంది. ఆ దిశగా కృషి చేసి... మిమ్మల్ని ప్రేమించే కాపు, బలిజ యువతను సంతోషపరచాలని కోరుకుంటున్నాను" అని పేర్కొన్నారు

  • Loading...

More Telugu News