G. Kishan Reddy: బొగ్గు గనుల వేలం... సింగరేణి ఉద్యోగులకు కిషన్ రెడ్డి హామీ

Kishan Reddy promises Singareni employees
  • బొగ్గు గనుల వేలంతో రాష్ట్ర ప్రభుత్వాలకూ లబ్ధి ఉంటుందని వెల్లడి
  • ఉద్యోగులు, కార్మికులకు నష్టం జరగకుండా చూస్తామన్న కేంద్రమంత్రి
  • ఆదాయం కోసమే బొగ్గు గనులను వేలం వేయడం లేదని స్పష్టీకరణ

బొగ్గు గనుల వేలంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల విమర్శల నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. శుక్రవారం బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... ఈ వేలంతో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లబ్ధి చేకూరుతుందన్నారు. సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు నష్టం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సింగరేణిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకొని వేలం చేపట్టినట్లు తెలిపారు.

ఆదాయం కోసమే బొగ్గు గనులను వేలం వేయడం లేదని వివరణ ఇచ్చారు. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్‌లో సింగరేణి లాభం పొందేలా ఉత్పత్తిని ప్రారంభిస్తామన్నారు. త్వరలో ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాలతో మాట్లాడుతామని చెప్పారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కోరిన అంశాలపై చర్చస్తామన్నారు.

సింగరేణిని కాపాడుకోవడం అందరి బాధ్యత: జగదీశ్ రెడ్డి

సింగరేణిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి అన్నారు. బొగ్గు గనులను వేలం వేయడం అంటే సింగరేణికి ఉరి వేయడమేనని వ్యాఖ్యానించారు.

అంతకుముందు, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కూడా బొగ్గు గనుల వేలంపై మాట్లాడారు. సింగరేణికి కొత్త బొగ్గు గనులు కేటాయించాల్సి ఉందన్నారు. సత్తుపల్లిలో మూడు, కొయ్యగూడెంలో మూడు గనులు ఉన్నాయని... వాటిని కేటాయిస్తే సింగరేణికి అనువుగా ఉంటుందన్నారు. సింగరేణికి వేలంలో రిజర్వేషన్ కల్పించాలని కోరారు. సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని కోరుతూ కిషన్ రెడ్డికి ఆయన వినతిపత్రం ఇచ్చారు.

  • Loading...

More Telugu News