Rapaka Vara Prasad: ఈవీఎం ట్యాంపరింగ్ అనేది శుద్ధ అబద్ధం... జనాలు ఓట్లు వేయలేదంతే!: రాపాక వరప్రసాద్
- 2019 ఎన్నికల్లో జనసేన తరఫున రాజోలు ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక
- ఈ ఎన్నికల్లో అమలాపురం ఎంపీ స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీ
- హరీశ్ బాలయోగి చేతిలో చిత్తుగా ఓడిపోయిన వైనం
- ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్న జగన్ తదితరులు!
ఏపీలో 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించింది. రాజోలు అసెంబ్లీ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా రాపాక వరప్రసాద్ ఒక్కరే గెలిచారు. అయితే, కొన్నాళ్లకే వరప్రసాద్ జనసేనకు దూరం జరిగి అప్పటి అధికార వైసీపీ పంచన చేరారు.
2024 ఎన్నికల్లో అమలాపురం ఎంపీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాపాక... టీడీపీ అభ్యర్థి జీఎం హరీశ్ బాలయోగి చేతిలో 3.42 లక్షల ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు.
ఇక, ఈ ఎన్నికల్లో తమ ఓటమికి ఈవీఎంలే కారణమని వైసీపీ అధినేత జగన్ సహా, ఆ పార్టీ ముఖ్య నేతలు కూడా పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో, రాపాక వరప్రసాద్ భిన్నస్వరం వినిపిస్తున్నారు.
ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఈవీఎం ట్యాంపరింగ్ కారణమన్నది శుద్ధ అబద్ధం అని రాపాక కొట్టిపారేశారు. అవతల మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయని... మూడు పార్టీల మధ్య ఓటు షేరింగ్ బాగా జరిగిందని... అందుకే కూటమి అభ్యర్థులు గెలిచారని వివరించారు. తమకు ప్రజలు ఓట్లేయలేదని అన్నారు.
మాకు ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసు... బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసు... టీడీపీకి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసు... జనసేనకు ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసు... ఈవీఎం ట్యాంపరింగ్ ఏమీ లేదు" అని రాపాక స్పష్టం చేశారు.