Kejriwal: కేజ్రీవాల్ విడుదలకు ఢిల్లీ హైకోర్టు బ్రేక్

Arvind Kejriwal To Leave Jail Today Probe Agency Challenges His Bail
  • ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ పై హైకోర్టు స్టే
  • ఈడీ పిటిషన్ పై విచారణ పూర్తయ్యే వరకూ బెయిల్ ఇవ్వొద్దని ఆర్డర్
  • సాయంత్రం కేజ్రీవాల్ బయటకు వస్తారని ఎదురుచూస్తున్న ఆప్ నేతలకు షాక్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విడుదలను హైకోర్టు అడ్డుకుంది. ఈ రోజు సాయంత్రం తీహార్ జైలు నుంచి బయటకు రావాల్సిన కేజ్రీవాల్ ను విడుదల చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. గురువారం ట్రయల్ కోర్టు మంజూరు చేసిన బెయిల్ పై తాత్కాలిక స్టే విధించింది. ఈమేరకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్ ను అత్యవసరంగా విచారణకు చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. కేజ్రీవాల్ బెయిల్ ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈడీ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకు బెయిల్‌ మంజూరు చేయకూడదని స్పష్టం చేసింది. దీంతో సాయంత్రం తమ అధినేత బయటకు వస్తారని సంబరాలకు ఏర్పాట్లు చేసుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలకు షాక్ తగిలినట్లైంది.

అంతకుముందు..
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు సాయంత్రం జైలు నుంచి విడుదల కానున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో జైలుపాలైన కేజ్రీవాల్ కు ట్రయల్ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. స్కాంలో కేజ్రీవాల్ పాత్ర ఉందనేందుకు సరైన ఆధారాలను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమర్పించలేకపోయిందని వ్యాఖ్యానిస్తూ కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చింది.

 దీనిపై ఈడీ తరఫున వాదిస్తున్న లాయర్ అభ్యంతరం చెబుతూ.. లిక్కర్ స్కాంలో కీలకవ్యక్తి కేజ్రీవాలేనని పేర్కొన్నారు. బెయిల్ మంజూరు ఆదేశాలను 48 గంటల పాటు వాయిదా వేయాలని కోరారు. ఈ వినతిని ట్రయల్ కోర్టు తిరస్కరించింది. దీంతో తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్.. శుక్రవారం సాయంత్రం బెయిల్ పై బయటకు రావలసి వుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, ఇతరత్రా కీలక నిర్ణయాలలో కేజ్రీవాల్ కీలకంగా వ్యవహరించారని, ఈ భారీ స్కాంకు ఆయనే కింగ్ పిన్ అని ఈడీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేయడాన్ని హైకోర్టులో సవాల్ చేసింది. కేజ్రీవాల్ బయటకు వస్తే విచారణను ప్రభావితం చేస్తారని ఆరోపిస్తోంది.

అతిశీ ఆమరణ నిరాహార దీక్ష
ఢిల్లీలో నీటి కొరతపై ఆప్ నేత, ఢిల్లీ మంత్రి అతిశీ నేటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. హర్యానా సర్కారు నీటిని విడుదల చేయకపోవడంతో యమునా నదితో పాటు ఢిల్లీ ప్రజల గొంతు ఎండుతోందని ఆమె ఆరోపించారు. ఢిల్లీ వాసుల ప్రాణాలు కాపాడాలంటూ హర్యానా సర్కారుకు చేతులెత్తి దండం పెట్టినా పట్టించుకోలేదని అతిశీ చెప్పారు. దీంతో హర్యానా సర్కారు యమునా నదిలోకి నీటిని విడుదల చేసే వరకూ ఆమరణ నిరహార దీక్ష చేస్తానని, ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తన దీక్ష మొదలవుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News